KKR Squad: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. శ్రీలంక యువ పేసర్ మతీష పతిరానా ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని జట్టు హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. శ్రీలంక క్రికెట్ బోర్డుతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయి.. పతిరానా ప్రస్తుతం రిహాబ్‌లో ఉన్నాడని తెలిపారు. -ఏప్రిల్ మధ్య నాటికి అతను ఫిట్‌గా మారుతాడని శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి సమాచారం వచ్చింది.. అప్పటికి జట్టుతో చేరే ఛాన్స్ ఉందన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో రూ.18 కోట్లకు మతీశ పతిరానాను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కొనుగోలు చేసింది. డెత్ ఓవర్లలో బౌలింగ్ సమస్యలను పరిష్కరించేందుకు అతను కీలకంగా మారుతాడని భావించారు. ముఖ్యంగా ఆండ్రే రస్సెల్ స్థానంలో పతిరానా కీలక పాత్ర పోషిస్తాడని తుది జట్టులోకి తీసుకున్నారు తెలిపారు. కానీ టీ20 వరల్డ్ కప్ సందర్భంగా హామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన అతను కనీసం మొదటి మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
హర్షిత్ రాణా హెల్త్ పై అప్‌డేట్:
ఇక మరో పేసర్ హర్షిత్ రాణా ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అక్కడి నుంచి ఫిట్‌నెస్ అప్‌డేట్ వచ్చిన తర్వాతే అతని రీప్లేస్‌మెంట్‌ను ప్రకటిస్తామని కోచ్ అభిషేక్ నాయర్ తెలిపారు. ప్రస్తుతం కేకేఆర్ క్యాంప్‌లో కేఎం ఆసిఫ్, సిమర్జీత్ సింగ్, నవదీప్ సైనీ వంటి పేసర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరిలో ఒకరిని తుది జట్టులో ఎంపిక చేసే అవకాశం ఉంది. హర్షిత్ హెల్త్ అప్‌డేట్ వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం.. ప్రస్తుతం రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరిగాయి, ఆటగాళ్లను అంచనా వేస్తున్నాం.. ముంబై వెళ్లేలోపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో ఆడనుంది. పతిరానా లేని పరిస్థితిలో జట్టు బౌలింగ్ బలం ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
