- నది వెంట ఉన్న పేదలు, ముస్లింల పరిస్థితి ఏంటి? : అక్బరుద్దీన్ ఒవైసీ
- మున్సిపాలిటీల విలీన ప్రక్రియ ఏ ప్రాతిపదికన చేపట్టారో తెలపాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ రెనోవేషన్ ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. 18 నెలల్లో డీపీఆర్ రెడీ చేస్తామని ఈ ప్రభుత్వం ప్రకటించిందని.. కానీ, ఇప్పటికే రెండేండ్లు పూర్తయిందని ఆయన గుర్తుచేశారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశోత్తరాల కార్యక్రమంలో మూసీపై ఒవైసీ ప్రశ్నించారు. ‘‘మూసీ నదిని కచ్చితంగా రెనోవేషన్ చేసి తీరాలి.
ఈప్రాజెక్టు చేపడితే.. నది తీరంలో నివసిస్తున్న పేదలు, ముస్లింల పరిస్థితి ఏంటి? వారికి పునారావాసం ఎలా కల్పిస్తారు? మీరాలం దగ్గర కొత్త బ్రిడ్జి కడుతున్నారు. మూసీకి మీరాలంకు సంబంధం ఏమిటి. మూసీపై చెక్ డ్యామ్ లు వెంటనే పూర్తి చేయాలి. మీర్ ఆలం, మూసీలను వేరువేరుగా చూడాలి”అని సూచించారు.
రెండు, మూడంతస్తుల ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన వల్ల వీధి వ్యాపారులు ఎఫెక్ట్ అవుతారని, నదిపైన మూడు, నాలుగు బ్రిడ్జీలు కడితే అద్భుతంగా తయారవుతుందన్నారు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం కోసం తెచ్చిన జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. అసలు ఏ ప్రాతిపదికన విలీన ప్రక్రియను చేపట్టారని ప్రశ్నించారు. మూడు సర్కిళ్లు కాకుండా.. ఫ్యూచర్ సిటీని కూడా కలిపి నాలుగు సర్కిళ్లుగా చేయాలన్నారు.
