కొత్త కస్తూర్బాగాంధీ విద్యాలయాలు .. ప్రారంభం ఇంకెన్నడో!

కొత్త కస్తూర్బాగాంధీ విద్యాలయాలు ..   ప్రారంభం ఇంకెన్నడో!
  • కొత్త కస్తూర్బాగాంధీ విద్యాలయాలు ..   ప్రారంభం ఇంకెన్నడో!
  • 20 కొత్త కేజీబీవీలకు  కిందటేడాదే కేంద్రం మంజూరు 
  • ఈ ఏడాది కూడా ప్రారంభించని రాష్ట్ర సర్కారు
  • ఉన్నతాధికారులంతా మహిళలే అయినా పట్టింపు కరువు 

హైదరాబాద్, వెలుగు:  అడిగినా కూడా కేంద్రం విద్యాసంస్థలు ఇవ్వట్లేదని నిత్యం విమర్శించే రాష్ట్ర ప్రభుత్వం.. అనుమతి ఇచ్చిన వాటిని మాత్రం ప్రారంభించట్లేదు. గతేడాది సాంక్షన్ చేసిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) ఈ ఏడాది కూడా స్టార్ట్ చేయలేదు.  రాష్ట్రంలో 2022–23 విద్యాసంవత్సరానికి గాను10 జిల్లాల్లో నూతనంగా ఏర్పడ్డ మండలాల్లో కొత్తగా 20 కేజీబీవీల ఏర్పాటుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. ఒక్కో స్కూల్ లో 80 సీట్లను అనుమతిచ్చింది. ఈ విషయాన్ని గతేడాది సమగ్ర శిక్ష పీఏబీ మినిట్స్​లోనూ పొందుపర్చింది. ఈ స్కూళ్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 60% నిధులను ఇచ్చేందుకు కూడా అంగీకరించింది. గతేడాది వాటిని ప్రారంభించేందుకు సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ, ఏమైందో ఏమో గానీ ఇప్పటివరకూ ఆ స్కూళ్ల గురించి ఏ ఒక్కరూ నోరుమెదపట్లేదు. ఈ ఏడాదైనా ప్రారంభిస్తారని అంతా భావించారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలన్నర దాటినా కనీసం ఆయా స్కూళ్ల ప్రారంభంపై చర్చ కూడా లేదు. దీంతో ఈ ఏడాదిలో కొత్త మండలాల్లో కేజీబీవీల ఏర్పాటు లేనట్టేనని స్పష్టమవుతోంది. కొత్త కేజీబీవీలకు సంబంధించిన ఫైల్ సీఎం దగ్గర ఉన్నట్టు విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, మెడికల్ కాలేజీలు కావాలంటూ కేంద్రాన్ని ఎన్నిసార్లు అడుగుతున్నా.. ఇవ్వట్లేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విమర్శిస్తోంది. కానీ, అనుమతిచ్చిన కేజీబీవీలను మాత్రం ప్రారంభించట్లేదు. 

జిల్లా ప్రజాప్రతినిధులు సప్పుడుజేస్తలేరు.. 

రాష్ట్రంలో ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో కొత్త కేజీబీవీలకు కేంద్రం అనుమతించింది. వాటి ఏర్పాటు ఆలస్యమైతున్నా.. ఆయా జిల్లాలకు చెందిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి నోరుమెదపట్లేదు. మరోపక్క వీటిలో చదివేదంతా బాలికలే. రాష్ట్రంలోని కీలక పదవుల్లోనూ మహిళలే ఉన్నారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, సీఎస్ శాంతికుమారి, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన కీలకస్థానాల్లో ఉన్నారు. అయినా, బాలికల విద్య గురించి ఈ ఆఫీసర్లు పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాళ్లయినా కొద్దిగ దృష్టిపెడితే కొత్త స్కూళ్లు ఈ ఏడాదే ప్రారంభమయ్యే అవకాశముంటుంది.

కేంద్రం అనుమతిచ్చింది ఇక్కడే..  

ఆదిలాబాద్ జిల్లాలోని మావల, జగిత్యాల జిల్లాలోని బీర్పూర్, బుగ్గారం, కరీంనగర్ జిల్లాల్లోని కొత్తపల్లి, గన్నేరువరం, మహబూబాబాద్ జిల్లాలో దంతాలపల్లి, మహబూబ్ నగర్​ జిల్లాలో మహ్మదాబాద్, మెదక్ లో నార్సింగి, నిజాంపేట, హవేలీ గన్ పూర్, మాసాయిపేట, నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ సౌత్,         నిజామాబాద్ నార్త్ , సంగారెడ్డి జిల్లాలో నాగలిగిద్ద, మొగుడంపల్లి, చౌటకూర్ , సిద్దిపేట జిల్లాలో దూలిమిట్ట, వికారాబాద్ జిల్లాలో చౌదాపూర్ మండలాల్లో కొత్త కేబీబీవీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.