హైలెవల్​ బ్రిడ్జి పూర్తయ్యేదెప్పుడో.. పెద్ద వాన పడితే అండర్​ పాస్​ లోకి నీరు 

హైలెవల్​ బ్రిడ్జి పూర్తయ్యేదెప్పుడో.. పెద్ద వాన పడితే అండర్​ పాస్​ లోకి నీరు 
  • పెద్ద వాన పడితే అండర్​ పాస్​ లోకి నీరు
  • హైవే44 మీద మీద కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్​జామ్​   

మెదక్/ మనోహరాబాద్​, వెలుగు: దేశంలోనే అతి పొడవైన నేషనల్ హైవే 44పై రాత్రీపగలూ  వేల సంఖ్యలో వెహికల్స్​తిరుగుతుంటాయి. అలాంటి ఈ హైవే మీద నిర్మిస్తున్న  హైలెవల్​బ్రిడ్జి పనులు మొదలుపెట్టి ఐదేండ్లయినా ఇంకా  పూర్తి కాలేదు. దీంతో పెద్ద వర్షం పడినప్పుడల్లా వందల సంఖ్యలో  వెహికల్స్​  ఆగిపోయి.. ట్రాఫిక్​ జామ్​ అవుతోంది. ఈ వానాకాలం లోపు  బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందనుకున్నా కాలేదు. ఫలితంగా మళ్లీ ట్రాఫిక్​ తిప్పలు తప్పేలా లేవు. 

స్టీల్​ బ్రిడ్జి పనులు లేట్​

మెదక్​ జిల్లాలోని మనోహరాబాద్​ నుంచి కొత్తపల్లి వరకు రైల్వే లైన్​ నిర్మిస్తున్నారు.   ఇందులో భాగంగా మనోహరాబాద్​ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్​రైల్వే లైను వేశారు. ఈ  రైల్వే ట్రాక్​ మనోహారాబాద్​ మండలం రామాయిపల్లి వద్ద నేషనల్​ హైవే44ను క్రాస్​ చేస్తోంది. ఇక్కడ రూ. 109 కోట్లతో హైలెవల్​ ఓవర్​ బ్రిడ్జి  నిర్మాణం చేపట్టారు. 2018 ఆగస్టు 29న  బ్రిడ్జి పనులకు  శంకుస్థాపన చేశారు.  రైల్వే ట్రాక్​ కు రెండు వైపులా   చాలాదూరం నుంచి పిల్లర్స్​వేసి  హై లెవల్​ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి.  రైల్వే ట్రాక్​ పైన  నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి  పనులు 70 శాతం మాత్రమే పూర్తయ్యాయి.   స్టీల్​బ్రిడ్జి కంప్లీట్​ కావడానికి  మరో రెండు, మూడు నెలలు పట్టవచ్చునని అంచనా వేస్తున్నారు.  

కిలోమీటర్ల పొడువునా ట్రాఫిక్​జామ్​

బ్రిడ్జి నిర్మాణం వల్ల   హైవే మీద   రాకపోకలకు ఆటంకం లేకుండా ఉండేందుకు  రోడ్డుకు ఇరువైపులా అండర్​ పాస్​ నిర్మించారు.  సరైన ప్లానింగ్ లేకపోవడంతో భారీ వర్షం పడిన ప్రతిసారి చుట్టుపక్కల నుంచి వరద నీరంతా వచ్చి అండర్ పాస్ లో చేరుతోంది.  భారీగా  నీరు చేరుతుండడంతో  రాకపోకలు నిలిచిపోతున్నాయి. చాలా సందర్భాల్లో  కిలో మీటర్ల పొడవునా ట్రాఫిక్​జామ్​అయ్యింది. గత  వర్షాకాలంలో అండర్​ పాస్​లో  ఓ కారు పూర్తిగా మునిగిపోయింది. దాదాపు 24 గంటలు రాకపోకలు స్తంభించాయి.  ట్రాఫిక్​ జామయిన ప్రతిసారి ఇతర మార్గాల్లో వాహనాలను మళ్లించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.   ఈ వానాకాలంలోనూ ఈ సమస్య తప్పేలాలేదు. 

వాన పడిందంటే ఇబ్బందే

మోస్తారు వాన పడ్డా రామాయిపల్లి అండర్​ పాస్​లో నీరు నిండి  వెహికల్స్​ వెళ్లేందుకు ఇబ్బంది అవుతోంది. నాలుగేండ్ల నుంచి ప్రతి వానాకాలంలో ఇదే సమస్య ఎదురవుతోంది.  ఈ సారి  బ్రిడ్జి పూర్తవుతుందనుకున్నాం. కానీ ఈ వానాకాంలోనూ కష్టాలు తప్పేలాలేవు. ఉన్నతాధికారులు స్పందించి భారీ వర్షాలు పడక ముందే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించాలి.  

వెంకట్ రెడ్డి,మనోహారాబాద్