రుణమాఫీ ఎప్పుడు చేస్తరు : హరీశ్‌‌రావు

రుణమాఫీ ఎప్పుడు చేస్తరు : హరీశ్‌‌రావు
  •     సీఎం రేవంత్‌‌రెడ్డికి హరీశ్‌‌రావు లేఖ
  •     209 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణ
  •     వారి పేర్లతో జాబితా విడుదల

హైదరాబాద్, వెలుగు :  రైతులకు రెండు లక్షల రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌‌రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌‌రావు బుధవారం  లేఖ రాశారు. రుణమాఫీ faఎప్పట్లోగా చేస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలని ఆయన కోరారు.  రైతుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు హామీ పత్రం రాసివ్వాలని విజ్ఞప్తి చేశారు. లోన్లు కట్టాలని బ్యాంకర్లు రైతులను ఒత్తిడి చేస్తున్నారని, ఉమ్మడి మెదక్, వరంగల్ జిల్లాల్లో చాలా మంది రైతులకు బ్యాంకర్ల నుంచి లీగల్ నోటీసులు వచ్చాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

రైతుల తీసుకున్న లోన్లపై వడ్డీ పెరుగుతున్నదని, రుణాలు కట్టకపోవడం వల్ల వారి సిబిల్ స్కోర్ దెబ్బతింటున్నదన్నారు. దీని వల్ల బిడ్డల చదువులకో, పెండ్లీళ్లకో లోన్ కోసం ప్రయత్నించినా బ్యాంకులు ఇవ్వవని అన్నారు. ఈ పరిస్థితికి  గతంలో కాంగ్రెస్, రేవంత్‌‌రెడ్డి ఇచ్చిన హామీలే కారణమని లేఖలో పేర్కొన్నారు. డిసెంబర్ 9 నాడే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చిన విషయాన్ని హరీశ్ గుర్తు చేశారు. డిసెంబర్ 9 దాటి 4 నెలలు అవుతున్నదని, ఇంకెప్పుడు రుణమాఫీ చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

 రుణమాఫీతోపాటు పంట మద్దతు ధరపై రూ.500 బోనస్, ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం, పంటపొలాలకు నీళ్లు, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.

209 మంది రైతుల ఆత్మహత్య 

రాష్ట్రంలో కరెంట్ కోతలు, సాగునీటి ఎద్దడి వల్ల పంటలు ఎండిపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని హరీశ్ పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల ఒత్తిళ్లు, వేధింపులు తట్టుకోలేక మరికొంత మంది రైతులు ప్రాణం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మొత్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 209 మంది రైతులు ఆత్మహత్య  చేసుకున్నారని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

 ఆ 209 మంది పేర్లతో కూడిన జాబితాను హరీశ్ ట్విట్టర్‌‌‌‌లో పోస్టు చేయడంతోపాటు, మీడియాకు విడుదల చేశారు. రైతు పేరు, ఆత్మహత్య చేసుకున్న తేదీ, ఆత్మహత్య జరిగిన జిల్లా పేరు లేదా నియోజకవర్గం పేరును జాబితాలో పేర్కొన్నారు. కొంత మంది రైతులకు సంబంధించి మాత్రమే, వాళ్లు ఆత్మహత్య చేసుకున్న ఊరి పేరును స్పష్టంగా పేర్కొన్నారు. 

జిల్లాలవారీగా వివరాలు 

 నెల                                                ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య
డిసెంబర్ (9 నుంచి 31)            25
జనవరి                                           52
ఫిబ్రవరి                                          64
మార్చి                                           65
ఏప్రిల్                                           03