
ఒక్క గ్రామం పేరైనా చెప్పండి ..జడ్పీ మీటింగ్‌లో ఆసిఫాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సక్కు ఆగ్రహం
ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో మిషన్‌భగీరథ ద్వారా ఒక్క గ్రామానికి కూడా నీళ్లు సరఫరా కావడం లేదని ఆసిఫాబాద్ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శనివారం పట్టణంలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో అధికారులపై ఆయన మండిపడ్డారు. సమావేశంలో భాగంగా మిషన్‌భగీరథపై చర్చ జరగ్గా అధికారులు 1100 గ్రామాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. అయితే ఎమ్మెల్యే సక్కు జోక్యం చేసుకుని ఏఏ గ్రామాలకు ఇస్తున్నారో ఒక్క గ్రామం పేరైనా చెప్పండి అని ఈఈ వెంకటరమణను ప్రశ్నించారు. దీంతో ఈఈతో పాటు అక్కడున్న అధికారులు నోరెళ్లబెట్టారు. కనీసం ఒక్క గ్రామం పేరు కూడా చెప్పలేదు.
2010లో ప్రారంభించిన ఫిల్టర్‌బెడ్ ద్వారానే ఇప్పటివరకు నీళ్లు ఇవ్వడం లేదని, ఇక మిషన్‌భగీరథ నీళ్లు ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు. కాలమేదైనా ఆదివాసీలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, అధికారుల తీరుతోనే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా గాలి లెక్కలు మానుకుని, పక్కా సమాచారం ఇవ్వాలని కోరారు. ఆదివాసీలను అటవీ శాఖ అధికారులు సతాయించడం మానుకోవాలని సూచించారు.