
ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణిని కలిసి మాట్లాడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి సంగీతం అందించిన కీరవాణితో ఇటీవల కాసేపు ముచ్చటించారు పవన్. ఇందుకు సంబంధించిన వీడియోను మూవీ టీమ్ మంగళవారం (May 21) విడుదల చేశారు.
ఈ వీడియోలో ‘ఆస్కార్ అవార్డు ఎక్కడుంది సర్. ఒకసారి చూడాలని ఉంది’ అని పవన్ కళ్యాణ్ కీరవాణిని కోరగా.. అది ఎదురుగా పెట్టుకుంటే గర్వం వచ్చేస్తుందని దాచి పెట్టానంటూ చమత్కరించారు కీరవాణి. తర్వాత ఆస్కార్‌ను తెచ్చి పవన్ కళ్యాణ్‌కి ఇచ్చారు. ‘వాట్ ఏ గ్రేట్ మూమెంట్ సర్’ అని పవన్ అనగా, రెండోసారి మీ చేతుల మీదుగా అందుకుంటున్నా అని కీరవాణి అనడం అక్కడున్న అందర్నీ నవ్వులతో ముంచెత్తింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ‘హరిహర వీరమల్లు’ చిత్రం నుంచి మూడో పాట ఈరోజు విడుదల కానుంది.