లిక్కర్​ స్కామ్​లో సాక్ష్యాలెక్కడ?.. సీబీఐపై సుప్రీంకోర్టు సీరియస్ 

లిక్కర్​ స్కామ్​లో సాక్ష్యాలెక్కడ?.. సీబీఐపై సుప్రీంకోర్టు సీరియస్ 
  • క్రాస్‌‌ ఎగ్జామిన్ చేస్తే.. ఈ కేసు 2 నిమిషాలు కూడా నిలబడదు 
  • ఈ పాలసీని లీగల్‌‌గా సవాల్​ చేసే అవకాశముందా? 
  • వాట్సాప్ మెసేజ్‌‌లను ఆధారంగా తీసుకోవచ్చా?
  • ఆప్‌‌ను అక్యూస్డ్‌‌గా ఎందుకు చేర్చలేదని ప్రశ్న

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తున్న కేంద్ర ఏజెన్సీలపై సుప్రీంకోర్టు సీరియస్‌‌ అయింది. ఈ కేసు రెండు నిమిషాల్లోనే వీగిపోతుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మనీ ల్యాండరింగ్, అవినీతి వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్‌‌ పిటిషన్‌‌పై గురువారం సుప్రీం విచారణ జరిపింది. ఈ పాలసీని లీగల్‌‌గా సవాలు చేసే అవకాశముందా? అని సీబీఐని ప్రశ్నించింది. దీనికి వివరణ ఇచ్చిన సీబీఐ.. కొంత మందికి లాభం చేకూర్చేందుకే ఈ పాలసీని తీసుకొచ్చారని తెలిపింది. వాట్సాప్ సందేశాలను నేరారోపణలుగా పేర్కొంటూ.. సాక్ష్యాలుగా సమర్పించినట్లు చెప్పింది. దీంతో జోక్యం చేసుకున్న కోర్టు.. ఈ మెసేజ్‌‌లను ఆధారంగా తీసుకోవచ్చా? అని ప్రశ్నించింది. ఈ సమయంలో స్పందించిన ఈడీ.. సిగ్నల్ యాప్ ద్వారా నిందితులు చాట్ చేసుకున్నారని వెల్లడించింది. దీనిపై సీరియస్‌‌గా స్పందించిన కోర్టు.. ‘‘(లంచాల గురించి విజయ్ నాయర్, మనీశ్ సిసోడియా) మాట్లాడుకోవడం మీరు చూశారా? ఈ వాట్సాప్‌‌ చాట్‌‌ ఆమోదయోగ్యంగా ఉంటుందా? అప్రూవర్ చెప్పిందైనా నిజమని ఎలా నమ్మాలి? సాక్ష్యాధారాలు ఉండాలి కదా. క్రాస్‌‌ ఎగ్జామిన్ లో కేసు నిలబడదు’’ అని  కామెంట్ చేసింది. మనీ లాండరింగ్ కేసు నిందితుల జాబితాలో ఆమ్‌‌ ఆద్మీ పార్టీని చేర్చకపోవడాన్నీ కోర్టు తప్పుపట్టింది. 

‘కింగ్ పిన్’ వంతూ వస్తది: అనురాగ్ ఠాకూర్

లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాతోపాటు పలువురు నేతలు జైలుకి వెళ్లారని, బయట ఉన్న ‘కింగ్ పిన్’ వంతూ వస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కామెంట్ చేశారు. ‘‘అవినీతిపై పోరుతో అధికారంలోకి వచ్చిన వాళ్లు అవినీతిలో కూరుకుపోయారు” అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై సెటైర్లు వేశారు.