కర్నాటకలో తెలంగాణ పథకాలేవీ?

కర్నాటకలో తెలంగాణ పథకాలేవీ?

నారాయణ్ ఖేడ్, వెలుగు: బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజన్  ప్రభుత్వంలో అన్ని ట్రబుల్సే  ఉంటాయని మంత్రి హరీశ్​రావు అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పక్కనే ఉన్న కర్నాటకలో డబుల్ ఇంజన్  ప్రభుత్వమే ఉన్నప్పటికీ తెలంగాణలోని పథకాలు అక్కడ ఎందుకు లేవని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో  తెలంగాణ అన్ని నియోజకవర్గాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలకు సుపరిపాలన అందించడంలో విఫలమయ్యాయని, కానీ టీఆర్ఎస్ మాత్రం కులమత, రాజకీయ పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందని తెలిపారు. 

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఎస్టీ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన గూడెంలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన  ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. అంతకుముందు ఖేడ్ పట్టణంలో రూ.25 కోట్లతో నిర్మించనున్న రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఉత్తమ ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్ ను మంత్రి  సన్మానించారు. స్టూడెంట్స్​తో 
కలిసి భోజనం చేశారు.  కార్యక్రమంలో జడ్పీ చైర్​ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ శరత్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్, కంగ్టి ఎంపీపీ సంగీత వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షుడు పరమేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ బుజ్జి, నాయకులు పాల్గొన్నారు.  

బీజేపీ లీడర్ల అరెస్టు 

ఖేడ్ నియోజకవర్గంలో  మంత్రి హరీశ్​రావు పర్యటన సందర్భంగా బీజేపీ లీడర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు పత్రి రామకృష్ణ మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందన్నారు. అరెస్టయినవారిలో నాయకులు పట్నం మాణిక్యం, వెంకటరెడ్డి, సాకేత్ రెడ్డి ఉన్నారు.