ఉద్యమ సమయంలో కేటీఆర్, కవిత ఏడున్నరు?..భూమిపుత్రులం అని మాట్లాడడం విడ్డూరం

ఉద్యమ సమయంలో కేటీఆర్, కవిత ఏడున్నరు?..భూమిపుత్రులం అని మాట్లాడడం విడ్డూరం
  •     మెదక్‍ ఎంపీ రఘునందన్​రావు

వరంగల్/ఖిలా వరంగల్, వెలుగు: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌‌‌‌‌‌‌‌, కవిత తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా కనిపించలేదని, ఇప్పుడు భూమిపుత్రుల పేరుతో బాధ్యతారహిత వ్యాఖ్యలు చేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్‌‌‌‌‌‌‌‌రావు విమర్శించారు. 

శనివారం వరంగల్ జిల్లా మామునూర్‌‌‌‌‌‌‌‌లోని వాగ్దేవి కళాశాలలో నిర్వహించిన బీజేపీ శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌‌‌‌‌‌‌‌, రాణి రుద్రమతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌, కవిత 2007 తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఉద్యమ వారసత్వం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

తెలంగాణ కోసం అనేక మంది పోరాడారని, భూమిపుత్రుల పేరుతో ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మీడియాపై విమర్శలు చేసిన నాయకులు ఇప్పుడు అదే మీడియాను ఆశ్రయిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

 యూపీఏ హయాంలో కంటే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఎక్కువ ధాన్యం కొనుగోలు జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమై, ఇప్పుడు కేంద్రంపై నెపం మోపుతోందని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడని
 పేర్కొన్నారు.