చైన్ స్నాచర్లను పట్టుకుంటే.. నకిలీనోట్ల గ్యాంగ్‌‌‌‌ డొంక కదిలింది

చైన్ స్నాచర్లను పట్టుకుంటే.. నకిలీనోట్ల గ్యాంగ్‌‌‌‌ డొంక కదిలింది
  • 50 వేలిస్తే రూ.లక్ష నకిలీ నోట్లు
  • కమీషన్‌‌‌‌తో మార్కెట్‌‌‌‌లో చెలామణి
  • 9 మంది అరెస్ట్, రూ.3.22 లక్షల విలువ చేసే ఫేక్ కరెన్సీ స్వాధీనం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: చైన్ స్నాచర్లను పట్టుకుంటే ఫేక్ కరెన్సీ గ్యాంగ్‌‌‌‌ డొంక కదిలింది. మియాపూర్‌‌‌‌‌‌‌‌లో నకిలీ నోట్లు ప్రింట్‌‌‌‌ చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. ఫేక్ నోట్స్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ చేస్తున్న 11 మంది సభ్యుల ముఠాలో 9 మంది ఎల్బీనగర్‌‌‌‌ పోలీసులకు చిక్కారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. రూ.3.22 లక్షలు విలువ చేసే ఫేక్ నోట్స్, 2 కలర్ జిరాక్స్‌‌‌‌ ప్రింటర్స్, వాటర్ మార్క్‌‌‌‌ మెటీరియల్‌‌‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను రాచకొండ సీపీ మహేశ్‌‌‌‌ భగవత్‌‌‌‌ గురువారం వెల్లడించారు. 
రెంట్‌‌‌‌ హౌస్ కావాలంటూ స్నాచింగ్‌‌‌‌..
నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూర్‌‌‌‌‌‌‌‌ మండలం వరిగొండ గ్రామానికి చెందిన పేరం వెంకటశేషయ్య(43) జూబ్లీహిల్స్‌‌‌‌, వెంకటగిరిలో నివాసం ఉంటున్నాడు. వ్యభిచారం కేసులో గతేడాది నార్సింగి పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. యాదాద్రి జిల్లా ఆత్మకూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన మహ్మద్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (24) మేడ్చల్ జిల్లా చింతల్‌‌‌‌కి చెందిన ముప్పిడి హరిబాబు (28) పాత క్రిమినల్స్. పలు ప్రాపర్టీ అఫెన్సెస్‌‌‌‌లో గతేడాది అరెస్టయ్యారు. జైల్లోనే ముగ్గురూ ఫ్రెండ్స్‌‌‌‌ అయి నెల క్రితం జైలు నుంచి రిలీజై కొత్త తరహాలో చోరీలకు ప్లాన్ చేశారు. జనవరి 30న హస్తినాపురంలోని సెంట్రల్‌‌‌‌ కాలనీలో బ్యాచిలర్స్‌‌‌‌ కి రూమ్‌‌‌‌ ఇస్తామనే టూలెట్‌‌‌‌ బోర్డ్‌‌‌‌ చూసి.. 31న ముగ్గురూ ఇంట్లోకి వెళ్లి రూమ్‌‌‌‌ రెంట్‌‌‌‌ కి కావాలని అడిగారు. ఇంట్లోని వృద్ధురాలిని వాటర్ అడిగి. కిచెన్‌‌‌‌లోకి వెళ్లిన వృద్ధురాలిపై దాడి చేసి పుస్తెలతాడు, చంద్రహారం చోరీ చేసి ఎస్కేప్ అయ్యారు.
వృద్ధురాలి నుంచి బంగారం దోపిడీ చేసి..
రాబరీ కేసు నమోదు చేసిన ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌లో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌‌‌‌ ఆధారంగా దర్యాప్తు చేశారు. వెంకట శేషయ్య, అహ్మద్‌‌‌‌, హరిబాబులను అరెస్ట్ చేశారు. వృద్ధురాలి నుంచి దొంగిలించిన 3 తులాల చంద్రహారం, 3 తులాల పుస్తెలతాడు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. శేషయ్య ఇంట్లో సెర్చ్‌‌‌‌ చేయగా రూ.40 వేల ఫేక్ నోట్లు గుర్తించారు. పోలీసులు విచారించి మియాపూర్‌‌‌‌లో ఉంటున్న తోట సంతోష్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ (37) ఫ్లాట్‌‌‌‌లో సోదాలు చేశారు. రూ.10 వేల విలువ చేసే ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా ఈస్ట్‌‌‌‌ గోదావరి జిల్లాకు చెందిన నకిలీ నోట్ల ప్రింటింగ్ ముఠాను గుర్తించారు.
ఈస్ట్‌‌‌‌ గోదావరి అడ్డాగా ఫేక్ నోట్ల దందా 
ఈస్ట్ గోదావరి జిల్లా అనపర్తికి చెందిన ఒగిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి (22) స్థానిక హోటల్స్‌‌‌‌ లో లేబర్‌‌‌‌‌‌‌‌గా పని చేసేవాడు. తన బంధువు శ్రీనివాస్‌‌‌‌ రెడ్డితో కలిసి రూ.100, రూ.200, రూ.500 ఫేక్‌‌‌‌ నోట్లను ప్రింట్‌‌‌‌ చేసేవాడు. 1:2 రేషియోలో మీడియేటర్స్‌‌‌‌ కి కమీషన్స్ ఇచ్చేవాడు. రూ.50 వేల ఒరిజినల్‌‌‌‌ నోట్లు ఇస్తే రూ.లక్ష విలువ చేసే ఫేక్ నోట్లు ఇచ్చేవారు. ఈ క్రమంలో గతేడాది కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు చిక్కారు. జైలు నుంచి రిలీజ్‌‌‌‌ అయిన తరువాత తన ఫ్రెండ్స్‌‌‌‌ కొదురి శివగణేశ్(26) నాగిరెడ్డి, మస్తాన్‌‌‌‌తో కలిసి మళ్లీ ఫేక్ నోట్ల దందా ప్రారంభించాడు. ఈస్ట్‌‌‌‌ గోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరి శ్రీనివాస్ రెడ్డి (48), శ్రీకాంత్‌‌‌‌ రెడ్డి (48), కర్రి నాగేంద్రసుధామాధవ రెడ్డి(45), సోరంపుడి శ్రీనివాస్‌‌‌‌ (44), పిల్లి రామకృష్ణ(32)తో కమీషన్ దందా చేసేవారు. కేసు నిందితులు కృష్ణారెడ్డి, శివగణేష్‌‌‌‌, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్‌‌‌‌ రెడ్డి, మాధవరెడ్డి, శ్రీనివాస్, రామకృష్ణ, శేషయ్య, తోట సంతోష్‌‌‌‌లను అరెస్ట్ చేశారు.