ప్రైవేటు వర్సిటీలు ఎవరి కోసం?

ప్రైవేటు వర్సిటీలు ఎవరి కోసం?

మెడిసిన్ చదివి డాక్టర్ అయి ప్రజలకు సేవ చేయాలనే మంచి ఆలోచనలు పాత చింతకాయ పచ్చడయింది. కోట్లు ఖర్చుపెట్టి అయినా డాక్టర్ కావాలి. ఆ తరువాత అందినకాడికి దాచుకోవాలనే స్వార్థం వెర్రి తలలు వేస్తున్నది. ఉచితంగా చదువుకోవాల్సిన మనం, ప్రజలకు సేవ చేయాల్సిన మనం, డబ్బు సంపాదన ఊబిలో ఎందుకు పడుతున్నామనే ఆలోచనలను నాటాల్సిన చారిత్రక సందర్భంలో ఉన్నాం. విద్యార్థుల ఫీజుల పేరిట కోట్ల రూపాయలను గుంజేది వాడే, విద్యార్థుల అనంతరం మళ్లీ జీతం కింద కొలువులో కుదుర్చుకొని దోపిడీ చేసేది వాడే. ప్రభుత్వాలను సైతం శాసించే స్థితిలో నేడు పడగవిప్పి బుసలు కొడుతున్న ఈ కార్పొరేట్ విష సర్పాల నుంచి సగటు విద్యార్థికి, ఉద్యోగికి విముక్తి ఎప్పుడు ?అన్న ప్రశ్నకు సమాధానం వెతకాలి.

విద్య, ఉద్యోగ విషయాల్లో అన్యాయానికి గురైన తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ లోకం ఉప్పెనై కదిలింది. సీమాంధ్ర కార్పొరేట్ శక్తుల నుంచి తెలంగాణ విముక్తి గీతం కోసం పరితపించి వందల మంది ప్రాణత్యాగాలతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నది ఇందుకేనా? ‘రాజ్యాలు మారిన ఓరన్న, మన రాత మారదు కర్మ ఏందన్న’ అన్నట్లు స్వరాష్ట్రంలోనూ పాత విధానమనే కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం నేడు విలయతాండవం చేస్తున్నది. కార్పొరేట్స్ గా ఎదిగిన పెద్దలు ప్రభుత్వాధినేతలుగా మారారు. ఈ ప్రభుత్వ పెద్దలకు ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం ద్వారా నూతన దోపిడీకి రాచమార్గం కల్పించారు. ఈ క్రమంలోనే కొత్తగా 6 యూనివర్సిటీలు వచ్చాయి. మరికొన్ని పెండింగ్​లో ఉన్నాయి. బిల్లు పెండింగ్​లో ఉండగానే  రెండు ప్రైవేటు యూనివర్సిటీలు విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. అనుమతులు లేకుండానే అడ్మిషన్స్ ఇచ్చి విద్యార్థుల జీవితాలను ఆగం చేస్తున్నాయి. సుమారు 4 వేల మంది విద్యార్థుల భవిష్యత్​ను పట్టించుకోకుండా ప్రభుత్వ పెద్దలు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినప్పటికీ నోటీసులతో చేతులు దులుపుకుంటున్నారు. ప్రైవేటు యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా అది అరణ్య రోదనగానే మిగులుతున్నది. ప్రభుత్వం 14,525 సీట్లకు అనుమతులు ఇచ్చి కౌన్సెలింగ్ ప్రకారం నింపాలని నిర్ణయించింది. అందుకు అనుకూలంగా చర్యలు చేపట్టింది. ఆ విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా అందించనుంది. అంతలోనే కాలేజ్ యాజమాన్యాలకు వారి కోటాల ప్రకారం 4,369 సీట్లుకు అనుమతిని ఇచ్చింది. వీరి నుంచి ఎంతైనా ఫీజు గుంజుకోవచ్చు. పైగా ప్రభుత్వ ఉపకారాలు ఉండవు. ఇలాంటి కార్పొరేట్ శక్తులకు మేలు చేసే ప్రభుత్వ చర్యలను ప్రశ్నించకుండా ఎలా ఉండగలం?

పోరాటాలే శరణ్యం..

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ స్వరాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురవుతున్నది. శతాబ్దిక సంవత్సర ఓయూ అరకొర వసతులతో అంగలార్చుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో న్యాక్ రేటింగ్10వ స్థానంలో సగర్వంగా ఉన్న వర్సిటీ.. నేడది 30వ ర్యాంకులోకి దిగజారిపోయింది. కేవలం 400 మంది ఆచార్యులు కూడా లేని స్థితిలో దీనంగా ప్రభుత్వ చేయూత కోసం అర్థిస్తున్నది. జీతాలు కూడా సమకూర్చుకోలేని స్థితిని కల్పించి, ప్రైవేట్ యూనివర్సిటీలకు దారి సుగమం చేయాలని బయలుదేరారు మన పాలకులు. ప్రభుత్వ చేయూత కరువైన యూనివర్సిటీ ఫీజుల మీదనే ఆధారపడాల్సి వస్తోంది. అందుకోసం ఫీజులను పెంచుతున్నది. ఫీజులు కట్టలేని విద్యార్థుల ఆవేదన వర్ణనాతీతం. నాటి తెలంగాణ ఉద్యమ కేంద్రాలైన ఓయూ, జేయూ, తెలంగాణ, పాలమూరు, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూ లాంటి విశ్వవిద్యాలయాల్లో కనీస వసతులు లేవు. టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీలు కొరవడి దుర్భరంగా మారాయి. నేడు టీచింగ్ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కామన్ బోర్డు పేరుతో రాజకీయ కుట్రలకు తెరలేపింది. విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని గంగలో కలపడాన్ని విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా నిరసిస్తున్నారు. ప్రభుత్వ విద్యావిధానంను గాలికొదిలి, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు మొత్తం విద్యా వ్యవస్థను అప్పుజెప్పాలని చూస్తున్న ఈ విద్యార్థి వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్ప మరో మార్గం కనిపించటం లేదు. విద్యార్థులకు, నిరుద్యోగులకు కదన రంగమే శరణ్యం. విశాల తెలంగాణ ప్రజానీకం ఒక్కతాటిపై నిలబడి ప్రైవేటు విశ్వవిద్యాలయాల రద్దు కోసం పోరాడుదాం. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం. -కార్పొరేట్ శక్తుల చేతుల నుంచి మన విద్యారంగాన్ని కాపాడుకుందాం. 

కార్పొరేట్ ​దోపిడీ..

గతంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు కొత్త అడ్మిషన్ల అనుమతి కోసం సుప్రీంకోర్టుకు వెళితే ఫీజు రీయింబర్స్​మెంట్ భారమని వాదనలు వినిపించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఎన్నికల ఏడాది కాబట్టి వాదనలు వినిపించిన దానికి భిన్నంగా నేడు రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపుగా 4,369 యాజమాన్య కోటా సీట్లకు అనుమతినిచ్చింది. అంటే దాదాపుగా 400 కోట్ల రూపాయల అవినీతికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే తెరలేపినట్టు లెక్క. ఏ ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా కనీస నిబంధనలు పాటించడం లేదని ఆరోపించిన కేసీఆర్ ప్రభుత్వం.. నేడు 4వేల సీట్ల అనుమతి ఇవ్వడం వెనుక ఏ అదృశ్య శక్తి పనిచేస్తోందో చెప్పాలి? ఇంజనీరింగ్ సీటుకోసం రూ.15 లక్షలు, మెడికల్ సీటు కోసం కోటి రూపాయలను డొనేషన్ రూపంలో ప్రత్యక్షంగా లంచం తీసుకున్నా కూడా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. దోపిడీని వేగవంతం చేయడానికి గవర్నర్ వద్దనున్న ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును నయానో- భయానో ఒప్పించి పాస్ చేయించాలని ప్రభుత్వం కంకణం కట్టుకొని తిరుగుతున్నది. దీన్ని బట్టి కార్పొరేట్ దోపిడీ ఎంతగా పేట్రేగిపోతున్నదో అర్థం చేసుకోవచ్చు. 



ఎస్​. వినోద్ కుమార్,ఓయూ రీసెర్చ్​ స్కాలర్