- వారానికోసారి విజిట్ చేయాలన్న నిబంధనలు బేఖాతరు
- గత అక్టోబర్‌లో సగానికిపైగా సీసీఐల వైపు కన్నెత్తి చూడలే
- గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల్లో పరిస్థితి మరీ అధ్వానం
- ప్రశ్నార్థకంగా మారిన చిన్నారుల భవిష్యత్తు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అనాథ ఆశ్రమాలు, చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్ల (సీసీఐ) పర్యవేక్షణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నది. అభం శుభం తెలియని చిన్నారుల బాగోగులు చూడాల్సిన జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు హోమ్స్ వైపు కన్నెత్తి చూడటం లేదు. నిబంధనల ప్రకారం.. వారానికొకసారి ప్రతి సీసీఐని సందర్శించి పరిస్థితులను సమీక్షించాల్సి ఉంది. అయినా, కొన్ని ఇన్‌స్టిట్యూషన్లను నెలలు గడుస్తున్నా అధికారులు విజిట్ చేయడం లేదు.
దీంతో చిన్నారులకు అందుతున్న ఆహారం, వసతి, భద్రత ప్రశ్నార్థకంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 284 సీసీఐలు (54 ప్రభుత్వ, 230 ప్రైవేట్) ఉండగా.. గత అక్టోబర్ నెలలో సగానికిపైగా హోమ్స్‌ను అధికారులు సందర్శించలేదు. సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లకే ఉన్నతాధికారులు పరిమితం అవుతుండటంతో .. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చిన్నారుల సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నారనే వెల్లువెత్తుతున్నాయి.
సగానికి సగం విజిట్ చేస్తలే..
ప్రభుత్వ అధికారిక లెక్కలే చిన్నారుల సంరక్షణ ఎంత అధ్వానంగా ఉందో చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 54 ప్రభుత్వ, 230 ప్రైవేట్ హోమ్స్ కలిపి మొత్తం 284 చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్లు ఉన్నాయి. ప్రతి వారం జిల్లా సంక్షేమ అధికారి, చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, సూపర్‌వైజర్లు తప్పనిసరిగా సందర్శించి, వివరాలు నమోదు చేయాలి. కానీ అక్టోబర్ లెక్కలు అధికారుల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేశాయి. మొత్తం 284 సీసీఐలు ఉంటే, అక్టోబర్ మొదటి వారంలో 139, రెండో వారంలో 203, మూడో వారంలో 198, నాలుగో వారంలో 126 సీసీఐలను మాత్రమే అధికారులు విజిట్ చేశారు. సగటున మొత్తం 58 శాతం సీసీఐలను మాత్రమే సందర్శించారు. 42 శాతం సీసీఐలలో తనిఖీలే చేయకపోవడం గమనార్హం.
గ్రేటర్ జిల్లాల్లో మరీ అధ్వానం
సిటీ చుట్టున్న జిల్లాల్లోనే ఎక్కువ శాతం సీసీఐలున్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 49 సీసీఐలు (6 ప్రభుత్వ, 43 ప్రైవేట్) ఉన్నాయి. అక్టోబర్ నెలలో 4 వారాలపాటు సందర్శించని సీసీఐల సగటు సంఖ్య 24.25గా ఉన్నది. దీని ప్రకారం.. సగటున 50.52% సీసీఐలను విజిట్ చేయలేదు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 38 సీసీఐలు (ఒక ప్రభుత్వ, 37 ప్రైవేట్) ఉన్నాయి.
4 వారాల్లో విజిట్ చేయని సీసీఐల సగటు 23.75 శాతంగా ఉంది. అంటే.. సగటున 62.5% సీసీఐలను అధికారులు సందర్శించలేదు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో మొత్తం 66 సీసీఐలు (3 ప్రభుత్వ, 63 ప్రైవేట్) ఉన్నాయి. అక్టోబర్‌లో 4 వారాలపాటు సందర్శించని సీసీఐల సగటు 14 శాతం. దీని ప్రకారం... సగటున 21.21% సీసీఐలను విజిట్ చేయలేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పోలిస్తే, మేడ్చల్ జిల్లాల్లో తనిఖీల్లో కొంత మెరుగుదల కనిపించింది.
వెళ్లినా మొక్కుబడి సందర్శనలే..
కొందరు అధికారులు తనిఖీలకు వెళ్లినా, అవి కేవలం మొక్కుబడిగా.. కాగితాలకే పరిమితం అవుతున్నాయనే విమర్శలున్నాయి. హోమ్‌కు వెళ్లిన ఆఫీసర్లు విజిటర్స్ రిజిస్టర్‌లో సంతకం పెట్టి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, చిన్నారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆశ్రమంలో వంట గది, పడక గదులు, మరుగుదొడ్ల పరిశుభ్రత, ఆహార నాణ్యతను పరిశీలించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఫామ్–46 నింపేసి వెళ్లిపోతున్నారు. దీంతో అనాథ చిన్నారులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా రోదిస్తున్నారు.
