
కామారెడ్డి, వెలుగు: భూముల ధరలు విఫరీతంగా పెరిగిన నేపథ్యంలో సొంత అన్నదమ్ముల మధ్యనే గొడవలు జరుగుతున్నాయి. పొలం గట్ల దగ్గర ఘర్షణ పడి ప్రాణాలు తీసుకునే వరకు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో భూ తగాదాల నేపథ్యంలో తమ్మున్ని అన్న హత్య చేశారు.
స్థానిక ఎస్సై శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డికి చెందిన మామిడి కిషన్, మామిడి దేవరాజు ఇద్దరు అన్నదమ్ములు. వీరి మధ్య గత కొంత కాలంగా భూ గొడవలు ఉన్నాయి. కుల పంచాయతీలో కూడా పరిష్కారం కాలేదు. ఆదివారం పొలం వద్ద గట్టు విషయంలో గొడవ పడ్డారు. తమ్ముడు దేవరాజు(39)పై అన్న కిషన్ పారతో దాడి చేయటంతో, దేవరాజుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.