కృష్ణా నదిలో పుట్టి మునిగి గల్లంతైన నలుగురి కోసం.. గాలింపు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు

కృష్ణా నదిలో పుట్టి మునిగి గల్లంతైన నలుగురి కోసం.. గాలింపు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు

నారాయణపేట, మక్తల్: కృష్ణా నదిలో పుట్టి మనిగి గల్లంతు అయిన నలుగురి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మక్తల్‌ మండలం పస్పల వద్ద నిన్న రాత్రి కృష్ణా నదిలో పుట్టి మునిగి నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. కర్నాటక రాయిచూర్ జిల్లా పెద్ద కుర్మపురం గ్రామానికి చెందిన 13 మంది నిన్న ఉదయం నిత్యవసరాల కోసం మక్తల్ పట్టణానికి వచ్చారు.

తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4 గంటలకు వల్లభాపురం దత్తక్షేత్రానికి చేరుకుని పుట్టిలో స్వగ్రామానికి బయలుదేరారు. కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నది మద్యలో కొంత దూరం వెళ్లగానే పుట్టి తిరగబడింది. తొమ్మిది మంది నది మధ్యలో చేట్ల కొమ్మలను పట్టుకుని సహాయం కోసం కేకలు పెట్టారు. పక్కన మరో పుట్టిలో వెళ్తున్నవారు.. ఒడ్డున ఉన్న వారు గమనించి అక్కడికి చేరుకుని తొమ్మిది మందిని రక్షించారు.

గల్లం తైన సుమలత(40), పూజ(6), నర్సమ్మ(30), పార్వతమ్మ(50) ఆచూకీ కోసం గాలింపు నిన్న రాత్రి నుండి కొనసాగుతోంది. వీరిలో సుమలత, పూజ తల్లికూతుళ్లు. సుమలత భర్తను స్థానికులు కాపాడారు. భార్యా, కూతురు చనిపోవడంతో అతని రోదనలు అందరికీ కంటతడి తెప్పించాయి. వరద అంతకంతకూ పెరుగుతుండడంతో సుశిక్షితులైన ఎన్డీఆర్ ఎప్ బలగాలతో గాలింపు కొనసాగిస్తున్నారు. వీరికి స్థానిక ప్రజలు కూడా సహకారం అందిస్తున్నారు.