జహీరాబాద్ లో కాంగ్రెస్ నుంచి..పోటీ చేసేదెవరో?

జహీరాబాద్ లో కాంగ్రెస్ నుంచి..పోటీ చేసేదెవరో?
  •       ఆసక్తి చూపని మాజీ మంత్రి గీతారెడ్డి!
  •       కొత్త అభ్యర్థిపై క్లారిటీ ఇవ్వని పార్టీ హైకమాండ్​
  •       పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి.. ఇతర పార్టీల్లోకి ముఖ్య నేతలు,కార్యకర్తలు

సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ రిజర్వ్ స్థానమైన జహీరాబాద్ లో కాంగ్రెస్ ​నుంచి పోటీ చేసేదెవరూ అనేదానిపై క్లారిటీ లేదు. . ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఇప్పుడు అభ్యర్థి కోసం తర్జనభర్జన పడుతోంది. పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి గీతారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరన్న ప్రచారం జరుగుతోంది. అనారోగ్య సమస్యలతో ఆమె జహీరాబాద్ సెగ్మెంట్ పై దృష్టి పెట్టలేకపోయారని, ఈసారి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తారని ఆమె అనుచరులు భావిస్తున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతుండగా ఈ విషయంలో పార్టీ హై కమాండ్ ఏ నిర్ణయానికి రాకపోవడంతో స్థానిక కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో చాలా మంది నేతలు కాంగ్రెస్​ను వీడి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. 

బలపడే అవకాశం ఉన్నా.. 

జహీరాబాద్ బీఆర్ఎస్ లో నెలకొన్న సంక్షోభాన్ని కాంగ్రెస్ క్యాచ్ చేసుకోవడం లేదని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావుకు ఈసారి టికెట్ రావడం డౌట్ అనే ప్రచారం జరుగుతుండగా, వివిధ రంగాల్లో ఉన్న కొందరు ప్రముఖులు గత నెలలో అధికార పార్టీలో చేరి టికెట్ ఆశిస్తున్నారు. కారు పార్టీలో టికెట్ల కుంపటి పెరిగి సయోధ్య లేకపోవడం ఒక ఎత్తయితే ఎమ్మెల్యే మాణిక్ రావుకు కొత్త వారితో సఖ్యత కుదరడం లేదన్న విషయాలు బయటపడుతున్నాయి.

ఇలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ లో గత వైభవాన్ని తిరిగి తెచ్చుకునే అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోతోందని పలువురు అంటున్నారు. పార్టీలో నాయకత్వ లోపం కనిపిస్తుండడం ఆ పార్టీ వర్గాల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కొందరు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ తోపాటు, ఇతర పార్టీల్లో చేరి భవిష్యత్ రాజకీయాల వైపు దృష్టి మళ్లించారు. 

చేరికలను ఆపలేకపోతున్రు..

అధికార పార్టీలోకి కాంగ్రెస్ నేతల వలసలను ఆ పార్టీ ఆపలేకపోతోంది. నెల రోజులుగా చేరికలను పోల్చుకుంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వై.నరోత్తం నుంచి మొన్నటి మైనార్టీ నాయకుల చేరికల వరకు పార్టీ ఫిరాయింపులు జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి బీఆర్ఎస్ ను బలపరిచేందుకు నరోత్తం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గీయులు చెప్పుకుంటున్నారు.

నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాల కాంగ్రెస్ సర్పంచులు, ఝరాసంఘం మాజీ ఎంపీపీ శంకర్, జహీరాబాద్ మండలం జాడిమల్కాపూర్ ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, జహీరాబాద్ పట్టణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మోహిజ్, మాజీ కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులు బీఆర్ఎస్ లో చేరిన వారిలో ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం జహీరాబాద్ నియోజకవర్గంపై దృష్టిపెట్టి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఆ పార్టీ నాయకులు, అభిమానులు కోరుతున్నారు.