రాజ్యసభకు ఎవరు?..పొన్నాలకా? మళ్లీ వద్దిరాజుకే ఛాన్సా!

రాజ్యసభకు ఎవరు?..పొన్నాలకా? మళ్లీ వద్దిరాజుకే ఛాన్సా!
  • బీఆర్ఎస్ లో మొదలైన చర్చలు
  • లోక్ సభ అభ్యర్థుల కోసమూ మొదలైన వేట
  • నిజామాబాద్ నుంచి కవితకు చాన్స్ లేనట్టే?
  • మిగతా స్థానాలపైనా గులాబీ పార్టీ కసరత్తు
  • డిస్కషన్ కోసం ఫాంహౌస్ కు వెళ్లిన కేటీఆర్

హైదరాబాద్: రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వాలన్న చర్చ గులాబీ పార్టీలో మొదలైంది. వచ్చే నెల 8 నుంచి  నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ఎంపీలు రిటైర్ అవుతున్నారు. వారిలో వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ ఉన్నారు.

ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా బీఆర్ఎస్ కు  ఒక్క సీటే దక్కనుంది. ఈ సీటును ఎవరికి కేటాయించాలనేదానిపై గులాబీ పార్టీలో తర్జనభర్జన మొదలైంది. మొదట ఎమ్మెల్సీ కవితకు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా నిజం కాదనే వాదన బలంగా వినిపిస్తోంది.

ఈ క్రమంలో ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ఆయనకు కేటాయిస్తారనే ప్రచారం మొదలైంది. అయితే వద్దిరాజు రవిచంద్రకు మరో సారి అవకాశం ఇవ్వవచ్చనే చర్చకూడా జరుగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. 

లోక్ సభ అభ్యర్థుల కోసం వేట

త్వరలో జరగనున్నలోక్ సభ ఎన్నికలకు ఇటీవలే సన్నాహక సమావేశాలు నిర్వహించిన గులాబీ పార్టీ అభ్యర్థులెవరనేదానిపై క్లారిటీకి రాలేకపోతోంది. నిజామాబాద్ ఎంపీ సీటును ఎమ్మెల్సీ కవితకు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరగా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం.

తనకు నిజామాబాద్ టికెట్ ఇవ్వకపోతే మెదక్ నుంచి టికెట్ కావాలని ఎమ్మెల్సీ కవిత అడిగారని తెలుస్తోంది. అయితే ఈ సీటను ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి లేదా వాళ్ల అన్నకు ఇస్తామని ప్రామిస్ చేశారని సమాచారం. మెదక్ జిల్లాలో కవిత ఎంట్రీని హరీశ్ రావు వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆమె జిల్లా జోక్యం చేసుకుంటారనే భావనతోనే హరీశ్ రావు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఫాంహౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ!

రాజ్యసభ సభ్యుడి ఎంపిక, లోక్ సభ అభ్యర్థుల అంశాన్ని చర్చించేందుకు  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి క్రితం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్ కు వెళ్లారు. ఎవరికి ఏ సీటు కేటాయించాలి.. ఎలాంటి వ్యూహం అనుసరించాలనేదానిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. సిట్టింగుల్లో దాదాపు ముగ్గురు నలుగురికి మాత్రమే సీట్లు దక్కే అవకాశం ఉంది. మిగతా వారి స్థానాల్లో  ఎవరిని అభ్యర్థులుగా ఖరారు చేయాలనేదానిపై చర్చిస్తున్నట్టు సమాచారం.