IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్‌లో భాగంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య 'ఎలిమినేటర్' మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుండగా, గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. 2016 తర్వాత తొలిసారి ఛాంపియన్‌గా నిలవాలని ఆరెంజ్ ఆర్మీ ఉవ్విళ్లూరుతుండగా, 2008లో తొలిసారి కప్పు కొట్టిన రాజస్థాన్.. 2022 ఫైనల్ పరాజయాన్ని మర్చిపోయి మళ్లీ విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది.
సన్‌రైజర్స్దే అధిపత్యం:
ఈ కీలక పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పదేళ్ల క్రితం నాటి అద్భుతమైన రికార్డు సరికొత్త స్ఫూర్తినిస్తోంది. 2016లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి ఫైనల్‌కు చేరి, కప్పు గెలిచిన ఏకైక జట్టుగా సన్‌రైజర్స్ సృష్టించిన రికార్డు ఐపీఎల్ చరిత్రలో నేటికీ చెక్కుచెదరలేదు. అదే ప్రేరణతో పాట్ కమిన్స్ సేన బరిలోకి దిగుతోంది. దానికి తోడు ఈ ఐపీఎల్ 2026 లీగ్ దశలో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడగా, రెండుసార్లూ సన్‌రైజర్సే ఆధిపత్యం చెలాయించింది. హైదరాబాద్‌లో 57 రన్స్ తేడాతో గెలిచిన ఆరెంజ్ ఆర్మీ.. ఆ తర్వాత ఏప్రిల్ చివర్లో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ 5 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉంది.
ALSO READ : ఏదైతే అదయింది.. ఎలిమిటేనర్ మ్యాచ్లో దబిడి దిబిడే
ఇరు జట్ల బలాబలాలు:
ఇరు జట్లు స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తున్నాయి. పాట్ కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి విధ్వంసకర ఓపెనర్లు, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి పవర్‌ఫుల్ హిట్టర్లు ఉన్నారు. అలాగే సలిల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్ వంటి యువ కెరటాలతో బౌలింగ్ విభాగం కూడా సూపర్బ్ గా ఉంది. ప్రఫుల్ హింగే ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. మరోవైపు రియాన్ పరాగ్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్.. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, దాసున్ షనక, డొనొవాన్ ఫెరీరా వంటి బ్యాటర్లతో పాటు జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ లాంటి మ్యాచ్ విన్నర్లతో బలంగా కనిపిస్తుదంఇ. రవీంద్ర జడేజా లేదా రవి బిష్ణోయ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే అవకాశం ఉంది.
