ఉక్రెయిన్​ చిన్నారి పాట కదిలించింది

ఉక్రెయిన్​ చిన్నారి పాట కదిలించింది

ఈ చిన్నారి పేరు అమెలియా అనిసోవిచ్. వయసు ఏడేండ్లు. రష్యా యుద్ధం కారణంగా సొంత దేశమైన ఉక్రెయిన్ నుంచి పోలెండ్​కి రెఫ్యూజీ (శరణార్థి)గా వచ్చింది. అక్కడి రెఫ్యూజీ క్యాంప్​లో అమ్మమ్మ, అన్నయ్యతో కలిసి ఉంటోంది.  కొన్ని రోజుల కిందట కీవ్​లోని ఒక బంకర్​లో అమెలియా పాడిన ‘లెట్ ఇట్ గో’ పాట సోషల్​ మీడియాలో వైరల్ అయింది. ఈమధ్యే రెఫ్యూజీలకు ఫండ్స్ రైజింగ్ కోసం ఉక్రెయిన్ 
జాతీయ గీతం పాడి అందరి మనసులు గెలిచింది ఈ పాపాయి. 

రష్యా సైన్యం యుద్ధం మొదలైన కొత్తలో కీవ్​నగరాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడం కోసం మిసైల్స్, బాంబు దాడులు చేసింది. ప్రాణాలు కాపాడుకునేందుకు అమెలియా తల్లిదండ్రులు  ఒక బంకర్​లో తలదాచుకున్నారు. అక్కడ బిక్కుబిక్కుమంటూ ఉన్నవాళ్లలో అమెలియా 
క్లాస్​మేట్​ కూడా ఉంది.  భయపడుతున్న తన క్లాస్​మేట్​లో ధైర్యం నింపేందుకు  పాపులర్​ డిస్నీ మూవీ ‘ఫ్రోజెన్​’లోని ‘లెట్ ఇట్​ గో” పాట పాడింది అమెలియా. ‘పోయిన దాన్ని మర్చిపోండి. గతం ఎప్పుడూ తిరిగి రాదు. అందుకే దాన్ని మర్చిపోండి. ఒక కొత్త రోజు మీకు దారి చూపిస్తుంది’ అంటూ ఈ చిన్నారి పాడుతుంటే బంకర్​లో ఉన్నవాళ్లు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్​ చేశారు. అమెలియా పాడుతున్న వీడియోని ఒకరు ఫేస్​బుక్​లో పెట్టారు. యుద్ధం మిగిల్చిన బాధ నుంచి బయటపడాలంటూ ఆ చిన్నారి పాడిన పాట ఎంతోమందిని కదిలించింది. 

ఛారిటీ కన్సర్ట్​లో...
‘లెట్​ ఇట్​ గో’ పాటతో సోషల్​ మీడియాలో వైరల్​ అయిన అమెలియా రెఫ్యూజీ ఫండ్​ రైజింగ్ కోసం మళ్లీ పాట పాడింది. పోలెండ్​లోని ఒక సాకర్ స్టేడియంలో టివిఎన్​ అనే మీడియా సంస్థ గత ఆది వారం  ‘టుగెదర్ ఫర్ ఉక్రెయిన్’ ఛారిటీ కన్సర్ట్ నిర్వ హించింది. ఆ ఈవెంట్​లో తెల్ల గౌన్​ వేసుకుని వేలాది మంది ముందు ఉక్రెయిన్ జాతీయ గీతం పాడింది అమెలియా. తర్వాత నవ్వుతూ అందర్నీ విష్​ చేసింది. ఆ చిన్నారి వాయిస్​కి అక్కడి వాళ్లంతా ఫిదా అయ్యారు. జాన్ కూపర్ అనే పెద్దాయన ఆ వీడియోని ట్విట్టర్​లో పెట్టాడు. ఇప్పటి వరకు 30 లక్షల మందికి పైగా ఆ వీడియోని చూశారు. ఈ చిన్నారి సింగింగ్ టాలెంట్​ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు చాలామంది. ఆ ఈవెంట్​ ద్వారా 2 కోట్ల రూపాయల ఫండ్స్ జమ అయ్యాయి.  

సింగర్ అవ్వాలని...
‘‘నేను ప్రతిరోజు పాటలు పాడటం ప్రాక్టీస్​ చేస్తా. మా జాతీయ గీతాన్ని చాలాసార్లు రిహార్సల్ చేశా. అందుకే అందరి ముందు అంత బాగా పాడగలిగా. సింగర్ అవ్వాలనేది నా డ్రీమ్. పెద్ద వేదిక మీద వేలా దిమంది ఆడియెన్స్​ ముందు పాడాలని ఉంది. నేను బొమ్మలు కూడా బాగా గీస్తా​” అంటోంది అమెలియా.