అజింక్యా రహానెపై అదనపు ఒత్తిడి ఖాయం

అజింక్యా రహానెపై అదనపు ఒత్తిడి ఖాయం

మెల్‌‌బోర్న్: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌‌లో టీమిండియా టాపార్డర్ బ్యాట్స్‌‌మన్ అజింక్యా రహానెపై అదనపు ఒత్తిడి ఉంటుందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ పెటర్నటీ లీవ్స్ తీసుకోనున్నందున.. మూడు టెస్టులకు అతడి గైర్హాజరీలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో రహానె కెప్టెన్సీ బాధ్యతలోపాటు బ్యాటింగ్ భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఒకవేళ సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ ఫిట్‌‌గా ఉంటే అతడు కెప్టెన్సీ పగ్గాలు చేపట్లే అవకాశాల్నీ కొట్టిపారేయలేం. కోహ్లీ గైర్హాజరీలో టీమిండియా గెలుపోటములపై రికీ పాంటింగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

‘మూడు టెస్టుల్లో కోహ్లీ ఆడకపోతే టీమిండియాపై తప్పక ప్రభావం చూపుతుంది. అతడి బ్యాటింగ్‌‌తోపాటు నాయకత్వాన్ని టీమ్ మిస్సవుతుంది. ఇది జట్టులోని మిగతా ప్లేయర్లపై ఒత్తిడి పడేలా చేస్తుంది. రహానె కెప్టెన్సీ చేపట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కెప్టెన్సీ చేస్తే మాత్రం అతడిపై అధిక ఒత్తిడి పడటం ఖాయం. అలాగే నంబర్ 4 పొజిషన్‌‌లో రాణించే బ్యాట్స్‌‌మన్ కావాలి. వారి బ్యాటింగ్ ఆర్డర్‌‌పై స్పష్టత కొరవడింది. కోహ్లీ ప్లేస్‌లో ఎవరు దిగుతారనేది కీలకంగా మారుతుంది. షమీ, బుమ్రాకు తోడుగా ఇషాంత్, ఉమేశ్ యాదవ్ బరిలో దిగుతారా? సైనీ లేదా సిరాజ్‌‌ల్లో ఎవరు ఆడతారు? ఇలాంటి మరికొన్ని ప్రశ్నలకు భారత్ జవాబులు కనుగొనాల్సి ఉంది’ అని పాంటింగ్ పేర్కొన్నారు.