భారతీయ విమానయానంలో అగ్రగామి అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్, పౌర విమానయాన భద్రతను రక్షించే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మధ్య సంభవించిన పరిణామాలు తీవ్ర సంక్షోభాన్ని సృష్టించాయి. ఈ సంఘటనలు పౌర భద్రతా చట్టాల ఉల్లంఘన, కార్పొరేట్ బాధ్యతా రాహిత్యంతోపాటు పర్యవేక్షక సంస్థల అలసత్వంవల్ల ఏర్పడిన సంక్లిష్టమైన న్యాయ సంక్షోభంగా మారింది. ఈ విపత్తు దేశ పౌర విమానయాన నియంత్రణ వ్యవస్థ మౌలిక లోపాలను బహిర్గతం చేసింది. విమానయాన రంగంలో గుత్తాధిపత్యమే ఈ సంక్షోభానికి కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సంక్షోభ నేపథ్యం
నవంబర్ 1, 2025 నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనల రెండో దశ ఈ సంక్షోభానికి ప్రధాన మూలకారణం. ఈ నిబంధనలు పైలట్‌ల వారపు విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచాయి. ఇది పైలట్‌ల అలసట రిస్క్‌ను తగ్గిస్తుంది. ఈ మార్పులు విమాన ప్రయాణాల భద్రతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచాలని లక్ష్యంగా చేసిన ప్రయత్నం.
ఈ నిబంధనల గురించి రెండు సంవత్సరాల ముందు నుంచే పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, కొత్త నిబంధనలకు అనుగుణంగా తగినంత మంది సిబ్బందిని సమకూర్చుకోవడంతోపాటు రోస్టరింగ్ వ్యవస్థను మెరుగుపరచడంలో ఇండిగో నిర్లక్ష్యం వహించింది. భారతదేశంలో అత్యధిక విమానాలను నడుపుతున్న సంస్థగా, సిబ్బంది కొరతను సరిచేయడానికి ఇండిగో ప్రణాళికా లోపం సంస్థ కార్యకలాపాలను ఒక్కసారిగా కుప్పకూల్చింది.
డీజీసీఏ వైఫల్యం
దేశ పౌర విమానయాన భద్రతకు అత్యున్నత బాధ్యత వహించే డీజీసీఏ చర్యలు ఈ సంక్షోభంలో అసమర్థతను చూపించిందని నిపుణులు విమర్శిస్తున్నారు. డీజీసీఏ, ఇండిగోకు షోకాజ్ నోటీసు ఇవ్వడం న్యాయపరమైన చర్య అయినప్పటికీ, వేలాది విమానాలు రద్దై, ప్రయాణీకులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన తర్వాత మాత్రమే డీజీసీఏ స్పందించింది.
ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్1937 ప్రకారం డీజీసీఏ సంస్థకు విమానయాన ఆపరేటర్‌పై భారీ జరిమానాలు విధించే అధికారం లేదా ఎయిర్ ఆపరేటర్స్ పర్మిట్ రద్దు చేసే అధికారం ఉంది. ఈ జాప్యం డీజీసీఏ వ్యవస్థాపరమైన పర్యవేక్షణ వైఫల్యాన్ని తెలియజేస్తుంది. ముందస్తు తనిఖీ చేయడంలో విఫలమవడం, డీజీసీఏ తన ప్రాథమిక భద్రతా విధులను పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టేనని విమర్శలు వచ్చాయి.
ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం
దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో చట్టపరమైన బాధ్యతతో పాటు నైతిక బాధ్యత వహించాలి. నిబంధనల అమలుకు తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమవడం అనేది కేవలం నిర్వహణ లోపం కాదు. ఇది 'ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం'గా పరిగణించవచ్చు. ఎందుకంటే, తమ అధిక లాభాలను కాపాడుకోవడానికి, ఇండిగో భద్రతా నిబంధనల అమలును ఆలస్యం చేసిందని, తద్వారా సంస్థ విమానయాన చట్టాలను ఉల్లంఘించిందని స్పష్టం చేస్తోంది. న్యాయ పదజాలంలో 'రెస్ ఇప్సా లోక్విటూర్' అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. అంటే, నష్టం జరగడానికి సంస్థ నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. ఈ నిబంధనల ఉల్లంఘన విమానయాన చట్టాల క్రింద ఇండిగో విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీసింది.
డీజీసీఏ సీఏఆర్ (పౌర విమానయాన అవసరాలు) సెక్షన్ 3, సిరీస్ ఎం, పార్ట్ IV అనేది విమాన ప్రయాణానికి నిరాకరించినప్పుడు, విమానాలు రద్దు అయినప్పుడు, ఆలస్యం అయినప్పుడు ప్రయాణీకులకు విమానయాన సంస్థలు అందించవలసిన సౌకర్యాలు, పరిహారం గురించిన నియమావళి ప్రకారం అందించాల్సిన నష్టపరిహారం, రిఫండ్‌లతో పాటు ఇతర సౌకర్యాలను సకాలంలో అందించడంలో కూడా ఇండిగో వైఫల్యం చెందింది. ఈ వైఫల్యం కారణంగా ఇండిగో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కింద 'సేవా లోపం'కు పూర్తి బాధ్యత వహించాలి.
భద్రత వర్సెస్ వాణిజ్యం
డీజీసీఏ తీసుకున్న అత్యంత ఆందోళనకరమైన నిర్ణయం ఏమిటంటే, ఇండిగో అభ్యర్థన మేరకు నిబంధనలను తాత్కాలికంగా సడలించడం. సంక్షోభాన్ని తాత్కాలికంగా చక్కదిద్దడానికి తీసుకున్న ఈ చర్య, పైలట్‌ల అలసట సమస్యను పరిష్కరించడానికి తీసుకొచ్చిన భద్రతా నిబంధనలను ‘కార్యాచరణ స్థిరత్వం’ పేరుతో పక్కన పెట్టింది.
ఇది పౌర భద్రతా చట్టాల మౌలిక సూత్రాలకు విరుద్ధమని ఏవియేషన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు గట్టిగా నిరూపిస్తున్నాయి. భద్రత అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పందం చేసుకోలేని అంశం. ఈ సమయంలో ఏ చిన్న భద్రతా వైఫల్యం జరిగినా, డీజీసీఏ దానికి సహ-బాధ్యతను వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, నిబంధనల ప్రకారం డీజీసీఏ ఈ వైఫల్యానికి ఇండిగోపై కఠినమైన ఆర్థిక జరిమానాలను తక్షణమే విధించాలి.
నష్ట పరిహారం కోసం న్యాయ స్థానాలకు..
ఇండిగో కార్యనిర్వహణ లోపాలు లక్షలాది మంది ప్రయాణికుల హక్కులను ఉల్లంఘించాయి. విమానం రద్దు అయితే, ఎయిర్‌లైన్ కచ్చితంగా ప్రత్యామ్నాయ విమానాన్ని లేదా పూర్తి రిఫండ్‌ను అందించాలి. సరైన సమయంలో సమాచారం ఇవ్వకపోతే, ప్రయాణ సమయాన్ని బట్టి రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు నష్టపరిహారం చెల్లించాలి.
ఈ పరిణామాలు, ఇండిగోపై ప్రయాణీకులు వ్యక్తిగతంగా, లేదంటే సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ ద్వారా సామూహిక నష్టపరిహారాన్ని, అలాగే మానసిక వేదనకు పరిహారాన్ని కూడా కోరేందుకు బలమైన న్యాయపరమైన ఆధారాన్ని ఇస్తున్నాయి. ఇండిగో ప్రయాణీకులు తమ నష్టపరిహారం కోసం నేరుగా జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లేదా రాష్ట్ర స్థాయి కమిషన్లను ఆశ్రయించవచ్చు.
భవిష్యత్తు కార్యాచరణ
ఈ సంక్షోభం భారత విమానయాన రంగంపై రెగ్యులేటరీ పట్టు ఎంత బలహీనంగా ఉందో స్పష్టం చేసింది. ఇండిగో సంస్థ డీజీసీఏ షోకాజ్ నోటీసుకు కట్టుబడి, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి తక్షణమే రిఫండ్‌ల తో పాటు నష్టపరిహారాన్ని చెల్లించాలి. అలాగే, నిబంధనలను పూర్తిగా పాటించడానికి 30 రోజుల్లో సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ను సంస్థ సమర్పించాలి.
డీజీసీఏ సంస్థ భద్రతను పణంగా పెట్టి ఇచ్చిన తాత్కాలిక నిబంధనల సడలింపును తక్షణమే ఉపసంహరించుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే డీజీసీఏ తన నియంత్రణతోపాటు తనిఖీ వ్యవస్థలను పూర్తిగా సంస్కరించాలి.
డా. కట్కూరి సైబర్ సెక్యూరిటీ & న్యాయ నిపుణుడు
