సోయం బాపురావును ఎందుకు అరెస్టు చేశారు

సోయం బాపురావును ఎందుకు అరెస్టు చేశారు

బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. అసలు సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. విద్యార్థుల ఆందోళనలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దారుణమన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఎన్నోసార్లు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు. విద్యార్థుల సమస్యలపై చర్చించి.. వారి బాధలు వినాలనే ఉద్దేశంతో అక్కడకు వెళితే పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. ట్రిపుల్ బాసర ఐటీలో నెలకొన్న సమస్యలపై ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడిని అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.

ప్రజాస్వామ్యబద్ధంగా కాంపౌండ్ వాల్  లోపల విద్యార్థులు నిరసన చేస్తుంటే.. వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి.. కించపరిచే విధంగా మంత్రులు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. విద్యార్థులు ఎంతో సమన్వయంతో ఉన్నారని.. ఎంతో మంది ప్రజాప్రతినిధులను కలిసి వారి గోడును వెళ్లబోసుకున్నారని వెల్లడించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకొనేందుకు తాను వెళ్లినా.. ఇతరులు వెళ్లినా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పినా.. ఇంతవరకు సద్దుమణగలేదన్నారు.  భయపెట్టినా.. విద్యార్థులు వెనకడుగు వేయడం లేదన్నారు. ఇక కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వెల్లడించాలని, ఇక్కడ ప్రజలు వరదలు... ఇతరత్రా సమస్యలపై కష్టాలు పడుతుంటే.. ఆయన ఢిల్లీకి వెళ్లడాన్ని తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు ఎక్కడున్నారని నిలదీశారు.