బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42% హక్కులు ఎందుకు ఇవ్వట్లే?..బీసీలను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోసం చేసింది: లక్ష్మణ్

బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42% హక్కులు ఎందుకు ఇవ్వట్లే?..బీసీలను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోసం చేసింది: లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మంత్రివర్గం, విద్యా రంగం, ఉద్యోగాల్లో బీసీలకు 42%  హక్కులు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆమె చిత్రపటానికి లక్ష్మణ్​ పూలమాల వేసి నివాళి అర్పించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీల హక్కుల విషయంలో ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం బీసీల పేరును వినియోగిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశాన్ని చిత్తశుద్ధితో కాకుండా, మాటలతో మోసం చేస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు.

 బీసీ రిజర్వేషన్లు దశాబ్దాల పాటు నిలిచిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అని ఆరోపించారు. బీసీల పేరును కేవలం ఓటు బ్యాంక్ కోసం వాడకుండా, వారి హక్కుల కోసం కృషి చేయాలని సూచించారు. ప్రధాని మోదీ బీసీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారని గుర్తుచేశారు. చాకలి ఐలమ్మను ప్రేరణగా తీసుకునే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను కూడా కల్పించారని పేర్కొన్నారు.