
- ప్రాజెక్టు కుంగినప్పుడు సీబీఐ విచారణను బీఆర్ఎస్ ఎందుకు కోరలె: మాజీ ఎంపీ వెంకటేశ్ నేత
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ పిల్లర్ నంబర్ 20 కుంగిపోయినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, అప్పుడు సీబీఐ విచారణ ఎందుకు కోరలేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ వెంకటేశ్ నేత ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐఏఎస్ అయినా.. మైండ్ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆదివారం పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘ప్రవీణ్ కుమార్ పిచ్చిపిచ్చిగా మాట్లాడటం చూస్తుంటే జాలేస్తోంది. ఆయన ఫ్రస్ట్రేషన్‌లో ఇలా మాట్లాడుతున్నారా.. లేక దొరల గడిలో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ఐదో తరగతి పిల్లాడిలా చదువుతున్నారా? బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కట్టుకథ అల్లారు. గురుకులాల్లో ప్రవీణ్ చేసిన అవినీతి బయటికి వస్తుందనే భయంతో పిచ్చి కుక్క కరిచినట్టు వ్యవహరిస్తున్నారు”అని మండిపడ్డారు.
కాళేశ్వరం కట్టు కథను ప్రాజెక్ట్ ఉన్న మహదేవపూర్ నుంచి మొదలెట్టి ఉక్రెయిన్ వరకు తీసుకెళ్లాడని ఎద్దేవా చేశారు. కట్టు కథలు అల్లడంలో హాలీవుడ్ డైరెక్టర్స్‌ను మించిపోయారన్నారు. ఆయనకు పిచ్చి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అవసరమని, బండి సంజయ్, కిషన్ రెడ్డిపై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగింది ఎలుక అవినీతి కాదని, ఏనుగు అవినీతి అన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతితో బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్స్ కొన్నారని ఆయన ఆరోపించారు. గురుకులాల్లో చేసిన అవినీతితో ప్రవీణ్ కుమార్ బుర్జ్ ఖలీఫాలో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.