
- రాష్ట్ర సర్కారును నిలదీసిన హైకోర్టు
- అభ్యంతరాలు పట్టించుకోనంత అవసరం ఏమొచ్చింది?
- ఒక్క రోజులో ఎలా పరిష్కరిస్తారు?
- ఎలక్షన్ల ప్రక్రియపై నమ్మకం సన్నగిల్లకుండా చూడాలని వ్యాఖ్య
- కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి, సర్కారుకు ఆదేశం
- ఇప్పటికిప్పుడే నోటిఫికేషన్ ఇవ్వబోమన్న ఎన్నికల సంఘం
హైదరాబాద్, వెలుగు: ‘‘మున్సిపల్ ఎలక్షన్ల కోసం పరుగులు పెట్టడం ఎందుకు. హడావుడిగా నోటిఫికేషన్ ఇవ్వడం.. నాలుగు రోజుల్లో అభ్యంతరాలు కోరడం, వాటిని ఒక్క రోజులోనే పరిష్కరిస్తామనడం సముచితంగా లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో కీలకం. దీనిపై ఉన్న నమ్మకం సన్నగిల్లకూడదు. ఎన్నికలకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించడం బహుశా ఇక్కడే జరిగి ఉంటుంది. ఎలక్షన్లు నిర్వహించడానికి 109 రోజులు పడుతుందని సింగిల్ జడ్జి వద్ద చెప్పిన సర్కారు.. ఇప్పుడు ఎందుకు ఇంత హడావుడి చేస్తోంది..”అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అయితే హడావుడి ఎలక్షన్లు చేపట్టడం లేదని, అభ్యంతరాలను పరిష్కరించాకే నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల సంఘం కోర్టుకు వివరణ ఇచ్చింది.
అభ్యంతరాలను పట్టించుకోవడం లేదు..
మున్సిపల్ ఎలక్షన్ల కోసం వార్డుల విభజన, ఓటర్ల జాబితా ఖరారు, రిజర్వేషన్లు తదితర అంశాలపై వెలువడిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ నిర్మల్‌కు చెందిన లాయర్ కె.అంజనీకుమార్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని కోర్టుకు విన్నవించారు. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం విచారణ విచారణ జరిపింది. తొలుత పిటిషనర్ తరఫున లాయర్ నరేశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్లు జరిపేందుకు సర్కారు సహకరించడం లేదంటూ కొద్దిరోజుల కింద రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు వెళ్లిందని.. దాంతో తమకు 109 రోజులు గడువు కావాలని సర్కారు సింగిల్ జడ్జికి విజ్ఞప్తి చేసిందని తెలిపారు. సానుకూలంగా స్పందించిన సింగిల్ జడ్జి.. కావాలంటే మరో పది రోజులు కూడా తీసుకుని, 119 రోజుల్లో ఎలక్షన్లు నిర్వహించాలని సూచించినట్టు గుర్తుచేశారు. కానీ ఇప్పుడు సర్కారు ఒక్కసారిగా హడావుడి చేస్తూ.. నెలరోజుల్లో ఎలక్షన్లు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోందని వివరించారు. దీనివల్ల ఎన్నికల ప్రక్రియ లోపభూయిష్టం అవుతుందని, ప్రజల అభ్యంతరాలపై చర్యలకు ఆస్కారం ఉండదని కోర్టుకు విన్నవించారు. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు.
అంత అవసరమేంటి?
పిటిషనర్ వాదనలు విన్న డివిజన్ బెంచ్ దీనిపై ప్రభుత్వాన్ని, ఈసీని నిలదీసింది. ఇప్పటి నుంచే ఎందుకంత హడావుడి అని, ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. సింగిల్ జడ్జి కోర్టులో జరిగిన దానికి భిన్నంగా ఎందుకు చేస్తున్నారని అడిగింది. వివిధ అంశాలపై అభ్యంతరాలు చెప్పడానికి నాలుగు రోజులు మాత్రమే గడువు ఇచ్చారని, వాటిని కూడా కేవలం ఒకే రోజులో ఎలా పరిష్కరిస్తారని నిలదీసింది. అయితే రాష్ట్రంలో 132 మున్సిపాలిటీలు ఉంటే కేవలం పదింటిలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జె.రామచందర్‌రావు బెంచ్‌కు వివరణ ఇచ్చారు. తొమ్మిది నెలలుగా అధికారులు వివిధ ఎన్నికల హడావుడిలో ఉన్నారని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారని తెలిపారు.
ఇప్పటికిప్పుడే నోటిఫికేషన్ ఇవ్వబోం
ఈ అంశంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా హైకోర్టుకు వివరణ ఇచ్చింది. హడావుడిగా ఎలక్షన్లు చేపట్టడం లేదని, వార్డుల విభజన, ఇతర అంశాలపై ప్రజల అభ్యంతరాలను పరిశీలించాకే తీరిగ్గా ఎలక్షన్లు నిర్వహిస్తామని తెలిపింది. ప్రజల అభ్యంతరాలను పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించామని, ఇప్పటికిప్పుడే ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కాబోదని చెప్పింది. వాదనలు విన్న బెంచ్.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఈసీకి నోటీసులిస్తూ.. విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది.