తప్పు చేస్తే తన బిడ్డయినా, కొడుకైనా వదిలిపెట్టేది లేదు.. జైలుకు పంపుడే అన్న కేసీఆర్....బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు వదిలిపెడుతున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని కేసీఆరే ఒప్పుకున్నారని..దళిత బంధులో రూ.3 లక్షల లంచం తీసుకుంటున్నారని చెప్పినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి చిట్టా ఉందని చెప్తున్న కేసీఆర్..వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు.
అవినీతికి పాల్పడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించడం లేదని షర్మిల ప్రశ్నించారు. ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే వెనకాముందు ఆలోచించకుండా మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని... ఆ అనామకుడికున్న విలువ కేసీఆర్ కు లేదా అని నిలదీశారు. కేసీఆర్ దగ్గర అవినీతి చిట్టా ఉన్నా...చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు.
లిక్కర్ స్కామ్లోనీ బిడ్డ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తారనే కదా..ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నా కండ్లు తుడుచుకొని చేతకాని దద్దమ్మలా చూస్తున్నావ్ అని కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ బంగారు బతుకమ్మే బాగా లేనప్పుడు.. ఇతరులను శిక్షించే అర్హత నీకెక్కడిదని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వానికి పాలించే స్థాయి లేదని... అవినీతి పాలనలో మునిగి తేలిన కేసీఆర్ ప్రభుత్వానికి..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడుతారని స్పష్టం చేశారు.