బాడీ షేప్​ కోసం బలవుతున్న యూత్.. స్టెరాయిడ్స్ కండలతో 100 కిలోలు ఎత్తనోళ్లు.. ఈజీగా 480 కిలోలు..

బాడీ షేప్​ కోసం బలవుతున్న యూత్.. స్టెరాయిడ్స్ కండలతో 100 కిలోలు ఎత్తనోళ్లు.. ఈజీగా 480 కిలోలు..
  • రాష్ట్రవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న జిమ్, ఫిట్​నెస్ సెంటర్లు
  • ఒక్కొక్కరి వద్ద నెలకు రూ. 3 వేల నుంచి 30 వేలు వసూలు
  • స్టెరాయిడ్స్ ​ఎఫెక్ట్తో కిడ్నీలు ఫెయిల్, హైబీపీ, హార్ట్ స్ట్రోక్స్
  • ఓరుగల్లులో స్టెరాయిడ్ల విక్రయంపై నార్కోటిక్  పోలీసుల నిఘా

వరంగల్‍, వెలుగు: హీరోలా మాదిరి కండలు, సిక్స్ ప్యాక్ కావాలని ఆశ పడే యూత్​ అనుభవం లేని కోచ్లు, స్టెరాయిడ్స్కు బలవుతున్నారు. ఏడాది పాటు అక్కడక్కడ జిమ్‍ చేసినోళ్లు కోచ్‍లుగా అవతారమెత్తుతున్నారు. తమ వద్దకు వచ్చేవారికి కండలు పెరగాలంటే స్టెరాయిడ్స్ వాడాలని చెబుతున్నారు. అవసరం లేకున్నా ధనార్జన కోసం యూత్​కు స్టెరాయిడ్స్ అంటగడుతున్నారు. వీరు  ఇన్‍స్టాగ్రాముల్లో పోస్టులు పెడుతూ కనెక్ట్​అయ్యే వారిని టార్గెట్‍ చేస్తున్నారు. మొదట్లో బాగానే ఉన్నా.. కొన్ని రోజుల తర్వాత సైడ్‍ ఎఫెక్ట్స్ కారణంగా హైబీపీ, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్  ఎటాక్‍ బారిన పడుతున్నారు. గ్రేటర్‍ వరంగల్లో ఇటీవల ఈ తరహా దందా బయటపడడంతో నార్కోటిక్‍ పోలీసులు స్టెరాయిడ్స్ అమ్మకాలపై స్పెషల్‍ ఫోకస్‍ పెట్టారు. 

కోర్సుల పేరుతో టాబ్లెట్లు, ఇంజక్షన్లు..
జిమ్‍, ఫిట్‍నెస్‍ సెంటర్లలో స్టెరాయిడ్స్ బిజినెస్‍ చేస్తున్నవారు వాటిని టాబ్లెట్‍, ఇంజక్షన్‍ రూపంలో విక్రయిస్తున్నారు. శక్తికి అవసరమైన ఎనర్జీ ఫుడ్‍ (సప్లిమెంటరీ) పేరుతో మొదట్లో వివిధ రకాల పౌడర్లతో దందా మొదలుపెట్టి, ఆపై స్టెరాయిడ్స్  ఇస్తున్నారు. ఇందులో 3, 6 నెలల కోర్సులు అలవాటు చేస్తున్నారు. మళ్లీ అంతే కాలం మాములుగా ఉంటూ రెండు, మూడు, నాలుగు రౌండ్​లుగా కోర్స్​ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు.

హ్యూమన్‍ గ్రోత్‍ హార్మోన్స్(హెచ్‍జీహెచ్‍), ఇన్స్​లిన్‍ గ్రోత్‍ ఫ్యాక్టర్‍(ఐజీఎఫ్‍), మయోస్టాటిన్‍ వంటి హానికర డినాబోల్‍, అనావర్‍, స్టాంజోలోల్‍, అనాబోల్‍, టూరినాబోల్‍, ట్రెనోబోలిన్‍, బోల్డ్‍నన్‍, విన్‍స్టల్‍, ప్రాపియోనేట్‍.. ఇలా చెప్పుకుంటూ పోతే స్టెరాయిడ్స్ ఎన్నో ఉన్నాయి. వీటి వాడకమే ప్రమాదకరమైతే.. ఎంత మోతాదు ఇవ్వాలో తెలియని పలువురు కోచ్‍లు గుడ్డిగా వాటిని అంటగడుతున్నారు. మొదట్లో నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తుండగా, ఆపై స్పెషల్‍ ట్రైనింగ్‍ పేరుతో రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు.    

100 కిలోలు ఎత్తనోళ్లు.. ఈజీగా 480 కిలోలు..
స్టెరాయిడ్స్ వాడకంతో అప్పటివరకు గట్టిగా ప్రయత్నిస్తే, 50 కిలోల బరువు ఎత్తనివారు కూడా ఈజీగా 200 కిలోలకు పైగా ఎత్తేస్తున్నారు. కండరాలు, ఎముకలు దృఢంగా మారి గతంలో కంటే నాలుగైదు రెట్లు బరువెత్తడానికి అలవాటు పడుతున్నారు. వరంగల్ పరిధిలో గతంలో 100 నుంచి 150 కిలోల లెగ్‍ ప్రెస్‍ చేసే ఒక కోచ్‍ ఏకంగా 480 కిలోల బరువెత్తి దానిని సోషల్‍ మీడియాలో పోస్ట్  చేశాడు. గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో ఒకరికి చిన్న వయసులోనే హార్ట్  స్ట్రోక్‍ వచ్చి చనిపోగా, మరో ఇద్దరికి కిడ్నీలు ఫెయిల్‍ అయ్యాయి. వీటిని వాడిన వారు మొదటి దశలో హైబీపీ 
బారినపడుతున్నారు.

జిల్లాలకు పాకిన విక్రయాలు..
స్టెరాయిడ్స్  వాడకం, విక్రయం గతంలో హైదరాబాద్‍ వరకే పరిమితమవగా.. ఇప్పుడు వరంగల్‍, కరీంనగర్‍, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్‍ ఇలా అన్ని జిల్లాలకు పాకింది. కొన్ని జిమ్‍ సెంటర్లలో ఓనర్లు, కోచ్‍లే వీటిని విక్రయిస్తుండగా..కండలు పెంచిన యువత సైతం దీనిని తమకు నాలుగు రాళ్లు సంపాదించిపెట్టే సైడ్​ బిజినెస్​గా మార్చుకుంటున్నారు. ఆన్‍లైన్‍లో ప్రొఫెషనల్‍ కోచ్‍ల పేరుతో స్టెరాయిడ్స్  ఎలా, ఎంత కోర్స్  వాడాలి, ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని తెలుపుతూ పోస్టులు పెట్టి కింద సెల్‍ నంబర్లు ఇస్తున్నారు. ఇలా ఆన్‍లైన్‍ బిజినెస్‍ పెంచుకుంటున్నారు. 

వరంగల్లో బయటపడ్డ దందా..
ఇన్నాళ్లు హైదరాబాద్​ వంటి సిటీలకే పరిమితమైన స్టెరాయిడ్స్  దందా ఇటీవల గ్రేటర్​ వరంగల్​లో బయటపడింది. స్టెరాయిడ్స్ దందా చేస్తున్న వరంగల్‍ డాక్టర్స్  కాలనీకి చెందిన కందగట్ల శ్రవణ్‍ కుమార్‍ మొదట్లో బాడీ బిల్డింగ్‍పై ఇష్టంతో హనుమకొండలోని ఓ జిమ్‍ లో ట్రైనింగ్‍ తీసుకున్నాడు. ఆ సమయంలో ప్రశాంత్‍ అనే వ్యక్తి ద్వారా స్టెరాయిడ్స్  తీసుకుని కండలు పెంచాడు. ఆపై అతను కోచ్‍ అయ్యాడు. తానుండే పిట్‍నెస్‍ సెంటర్​కు వచ్చే వారికి వీటిని అంటగడుతూ దందా చేస్తున్నాడు. వైజాగ్‍ ముఠా సభ్యులు మణికంఠ, ఆనంద్‍తో కలిసి స్టెరాయిడ్స్  విక్రయం మొదలుపెట్టాడు.

నాలుగేండ్లుగా బల్గేరియా, జర్మనీ, వియత్నాం దేశాల నుంచి సరుకు దిగుమతి చేసుకుని బిజినెస్‍ చేస్తున్నాడు. ఈ కేసులో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఆపై నార్కోటిక్‍ పోలీస్‍ టీం స్పెషల్‍ ఫోకస్‍ పెట్టింది. గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలోని జిమ్‍, ఫిట్‍నెస్‍ సెంటర్లపై దాడులు చేసింది. నిర్వాహకులకు కౌన్సిలింగ్‍ నిర్వహించింది. ఓనర్లకు తనిఖీలకు సంబంధించిన సమాచారం లీక్​ కావడంతో స్టెరాయిడ్స్ దందా చేసేవారు జాగ్రత్త పడ్డారని అంటున్నారు.

సీరియస్‍ యాక్షన్‍ తీసుకుంటాం..
నగరంలోని కొన్ని జిమ్‍, ఫిట్‍నెస్‍ సెంటర్లలో స్టెరాయిడ్స్  అమ్ముతున్నట్లు, వాడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. బల్గేరియా, జర్మనీ, వియత్నాం దేశాల నుంచి వైజాగ్‍  తీసుకొచ్చి, అక్కడినుంచి జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురిపై కేసు నమోదు చేశాం. స్టెరాయిడ్స్ విక్రయించే వారిపై సీరియస్‍ యాక్షన్‍ ఉంటది.
నందిరాం నాయక్‍, ఏసీపీ, వరంగల్‍