మంగళగిరి నుంచి లోకేశ్ పోటీ: ప్లస్సా..? మైనస్సా..?

మంగళగిరి నుంచి లోకేశ్ పోటీ: ప్లస్సా..? మైనస్సా..?

ఏపీ సీఎం చంద్రబాబు కొడుకు నారా లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేయడం కన్ఫామ్ అయింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేశ్ కోసం చాలా నియోజకవర్గాల పేర్లు వినిపించాయి. కానీ మంగళగిరినే ఫైనల్ చేశారు. ఇంతకీ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటీ..?

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల మొదటి లిస్ట్ లో మంగళగిరి నుంచి పార్టీ అభ్యర్థిగా లోకేశ్ పేరు  ప్రకటించారు. అయితే… మంగళగిరి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. టీడీపీ  అభ్యర్థి గంజి చిరంజీవిపై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్ల మెజార్టీతో  గెలిచారు. అప్పటికి అమరావతి రాజధాని ప్రాంతంగా లేదు. అమరావతి రాజధానిగా చేసిన తర్వాత ముఖద్వారంగా మారిన మంగళగిరిని టీడీపీ ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తోంది. రాజధాని అయిన తర్వాత భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇది ఇక్కడి రైతుల్లో టీడీపీపై సానుకూలతను పెంచిందని ఆ పార్టీ అంచనా వేస్తోంది.

2014లో కేవలం 12 ఓట్లతో ఓడినప్పటికీ.. తర్వాత మారిన పరిస్థితుల్లో టీడీపీకి అనుకూలత పెరిగిందని వివిధ సర్వేలు చెపుతున్నాయి. కాబట్టి మంగళగిరిలో గెలుపు అంత కష్టం కాదని చంద్రబాబు అంచనాకు వచ్చారు. వైసీపీ చేతిలో ఉన్న స్థానం కావడంతో ఇక్కడ నుంచి గెలిస్తే.. లోకేశ్ సమర్ధతను చాటుకోవడానికి మంచి అవకాశంగా ఉంటుందని భావిస్తున్నారు. మంగళగిరి కేంద్రంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధికి లోకేశ్ కృషి చేశారు. మరోవైపు వైసీపీ తరపున మరోసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉండటం కూడా లోకేశ్ కు కలిసొస్తుందని అధినేత అంచనా.

టీడీపీ గెలిచిన పలు స్థానాల్లో వ్యతిరేకత, అనుకూలత ఉన్నప్పటికీ… అమరావతి పరిధిలో ఉన్న మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో పార్టీపై అభిమానం కనిపిస్తోంది. తాడికొండ ఎలాగూ రిజర్వ్ స్థానం కావడంతో మంగళగిరిని ఎంచుకున్నారు. వీటన్నింటికీ మించి టీడీపీ తిరిగి  అధికారంలోకి వస్తే.. ఈ ప్రాంతంలో భూములు చాలా కీలకంగా మారతాయి. భూముల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. లోకేశ్ వంటి వారు ఎమ్మెల్యేగా ఉంటేనే తాము అనుకున్నది చేయవచ్చనే ఆలోచనలో ఉన్నారు బాబు.

టీడీపీ ఆవిర్బావం తర్వాత 1983, 1985 లో ఇక్కడ తెలుగుదేశం గెలిచింది. తర్వాత ఈ సీటును పొత్తుల్లో భాగంగా వామపక్షాలు, బీజేపీకి ఇస్తూ వచ్చింది తెలుగుదేశం. 1985 తర్వాత 2014లోనే మంగళగిరిలో టీడీపీ పోటీ చేసింది. ఇప్పుడు పోటీ చేస్తే పార్టీ అభిమానులను సంతృప్తి పర్చడం, లోకేశ్ నాయకత్వాన్ని ప్రచారం చేసుకోవడం.. రెండూ ఒకేసారి కలిసి వస్తాయని ప్లాన్ చేశారు.

మంగళగిరి అత్యధికంగా బీసీ ఓట్లున్న నియోజకవర్గం. ఇక్కడ దాదాపు దాదాపు లక్ష కంటే ఎక్కువ బీసీ ఓటర్లున్నారు. బీసీలు టీడీపీకి ముందు నుంచి అండగా ఉంటున్నారు. వ్యవసాయ కూలీలకు ఇక్కడ భారీగానే పింఛన్లు ఇచ్చారు. ఇది కలిసివచ్చే అంశమే.  పైగా రాజధాని ప్రాంతం.. సో.. లోకేశ్ గెలుపు ఈజీ అని.. అంచనా వేస్తున్నారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి అడ్డు తొలగించడం మరో ఉద్దేశం

అధికార టీడీపీతోనే నిత్యం తలపడిన నేత రామకృష్ణారెడ్డి. జగన్ కు నమ్మిన బంటులా ఉన్న ఆయన పలు అంశాలపై న్యాయ పోరాటం చేశారు. అమరావతిలో నిబంధనలు పాటించడం లేదంటూ కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్ లో డీజీపీ ఠాకూర్ స్థల ఆక్రమణ, ఓటుకు నోటు కేసు, సాధికార మిత్ర, సదావర్తి భూములు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, సివిల్ సర్వెంట్లకు భూముల కేటాయింపు,  ఎయిర్ పోర్టులో జగన్ పై దాడి.. ఇలా కేసుల్లో ఆయన పిటిషన్లు వేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. అడుగడుగునా అడ్డు తగులుతూనే ఉన్నారు. దీంతో.. ప్రభుత్వానికి సమస్యగా మారిన ఆర్కేకు ఓడించాలనేది కూడా.. లోకేశ్ కు మంగళగిరి నుంచి బరిలోకి దించడానికి ఓ కారణంగా చెబుతున్నారు.

లోకేష్ ఇప్పటిదాకా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. మంగళగిరిలో అయితే ప్రచారం అంతా చంద్రబాబు స్వయంగా పర్యవేక్షంచుకునే అవకాశం ఉంది. ఇలా అన్ని అనుకూలతలు చూసుకునే లోకేశ్ కు మంగళగిరి సీటు ఫైనల్ చేశారు చంద్రబాబు.