పథకాలు.. ప్రజా సమస్యలపై ఎందుకీ నిర్లక్ష్యం ?

పథకాలు.. ప్రజా సమస్యలపై ఎందుకీ నిర్లక్ష్యం ?
  • ప్రాణహిత పుష్కరాలపైనా రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం
  • కేంద్ర మంత్రి మురుగన్ ఆగ్రహం​
  • కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో పర్యటన

ఆసిఫాబాద్, వెలుగు: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్​ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయకపోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ అన్నారు. ప్రధాన మంత్రి అవాస్ యోజనను కూడా ఎందుకు అమలు చేయడం లేదో  అర్థం కావడం లేదని, పేదలకు ఉపయోగపడే పథకాల పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం ఆయన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని అభివృద్ధి, సంక్షేమంపై కలెక్టరేట్​లో  సమీక్షించారు. అనంతరం ప్రేమల గార్డెన్​లో మీడియాతో మాట్లాడారు. 
స్థానిక మహిళా సంఘం సినిమా థియేటర్ ను నిర్మించడం, వ్యాపార రంగంలో రాణించడం అభినందనీయమన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయంతోపాటు అంగన్ వాడీల పనితీరుపైనా తాము సమీక్షించామని చెప్పారు. జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నదని తెలిపారు. ఫసల్ బీమా యోజన రైతులకు ఇన్సూరెన్స్ పరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ పథకాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుంటే  తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రాణహిత పుష్కరాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. 
భక్తులకు సౌలతులు  కల్పించడంలో ఫెయిలైందన్నారు. ‘‘ఇదే పుష్కరాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు కేటాయిస్తే తెలంగాణ సర్కారు మాత్రం కనీస  సౌకర్యాలు కూడా కల్పించలేదు” అని మురుగన్​ దుయ్యబట్టారు. దేశంలో 118 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, ఏప్రిల్ 7 నుంచి 20 వరకు అన్ని శాఖల కేంద్ర మంత్రులు ఒక్కొక్కరూ రెండేసి జిల్లాల చొప్పున పర్యటించి సమస్యలు, అభివృద్ధిపై అధ్యాయం చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా శనివారం తాను తమిళనాడులోని బిరుదునగర్ జిల్లాలో పర్యటించానని, ఇప్పుడు తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నానని  వివరించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు  కొత్తపల్లి శ్రీనివాస్​ పాల్గొన్నారు.