
- అభ్యర్థుల లాగిన్ లో పలు మార్లు మార్కులు మారాయి
- హైకోర్టులో పిటిషనర్ల తరఫు అడ్వకేట్ వాదనలు
- విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్, వెలుగు: టీజీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌కు విరుద్ధంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన నాలుగు పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గ్రూప్-1 నోటిఫికేషన్‌లో ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు జారీ చేస్తామని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. వెబ్‌నోట్‌లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదన్నారు.
వారంలో మెయిన్స్ జరుగుతాయనగా కొత్త నంబర్లతో హాల్‌టికెట్లు జారీ అయ్యాయన్నారు. వరుసగా నంబర్లు కేటాయించడానికి సులభంగా ఉంటుందని టీజీపీఎస్సీ చెబుతున్న కారణం సహేతుకంగా లేదన్నారు. కేవలం కొంత మందికి లబ్ధి చేకూర్చడానికే మెయిన్స్‌కు హాల్‌టికెట్లు వేరుగా ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యూపీపీఎస్సీ పరీక్షలకు లక్షల మంది హాజరైనా ఒకే హాల్ టికెట్ జారీ చేస్తున్నదన్నారు. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలకు రెండు హాల్ టికెట్లు జారీ చేయడం అనుమానాలకు తావిస్తున్నదన్నారు.
పది మంది అదనంగా ఎలా వచ్చారు?
పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను ప్రకటించడంలోనూ సర్వీస్ కమిషన్ వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు లెక్కలు చెప్పిందని రచనారెడ్డి పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్షలు పూర్తికాగానే 21 వేల 75 మంది పరీక్షలు రాశారని చెప్పి, ఆ తర్వాత 21 వేల 85 మంది అని చెప్పడంపై అనుమానాలున్నాయన్నారు. ఈ పది మంది అదనంగా ఎలా వచ్చారన్నదానికి స్పష్టమైన వివరణ ఇవ్వట్లేదన్నారు. కోఠి ఉమెన్స్‌కాలేజీలో పురుషులకు టాయిలెట్స్ లేనందున వారి అభ్యర్థన మేరకు మహిళలనే కేటాయించామని టీజీపీఎస్సీ చెప్తోందన్నారు.
అలాంటప్పుడు మిగిలిన మహిళా కాలేజీల్లో పురుషులు, స్త్రీలు కలిసి ఎలా పరీక్ష రాశారన్నారు. అక్కడ కేవలం మహిళలనే ఎందుకు కేటాయించలేదన్నారు. ఇటీవల జరిగిన యూపీఎస్సీ పరీక్షలను కోఠి ఉమెన్స్‌కాలేజీలో పెట్టారని, పురుషులు, మహిళలు ఇద్దరూ హాజరయ్యారన్నారు. ఈ కేటాయింపుల్లో గూడుపుఠాని ఉందని, అందుకే కోఠి మహిళా కాలేజీలోని 2 సెంటర్లలో పరీక్ష రాసిన మహిళలు ఎక్కువ మంది అర్హత సాధించారన్నారు. ముందు వెనుక కూర్చున్నవారికి, పక్కపక్కన ఉన్న నంబర్లకు ఒకే రకమైన మార్కులు రావడాన్ని బట్టి చూస్తే మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని స్పష్టమవుతున్నదన్నారు.
మార్కులు తగ్గడంపై వినతి పత్రం ఇస్తే కేసు పెట్టారు
ఫలితాల వెల్లడిలోనూ అవకతవకలు జరిగాయని రచనా రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. వెబ్‌సైట్‌లో ప్రొవిజనల్ ఫలితాలను వెల్లడించలేదన్నారు. అభ్యర్థులు లాగిన్ అయి సబ్జెక్టుల వారీగా మార్కులు తెలుసుకోవాలని అన్నారని, అయితే ఈ మధ్య పలుమార్లు లోపల మార్కులు మారిపోయాయన్నారు. మార్కులు తగ్గడంపై వినతి పత్రం ఇస్తే నకిలీ అంటూ బెదిరించి క్రిమినల్ కేసు పెట్టారన్నారు. వాదనలు పూర్తికాకపోవడంతో న్యాయమూర్తి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ, వేల మంది అభ్యర్థులు నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని, శుక్రవారంతో వాదనలను ముగించాలని న్యాయవాదులకు సూచించారు.