- అందుకే పార్టీ ఫిరాయింపుల కేసులో విచారణకు ఏలేటి హాజరుకాలె: పాడి కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్ వేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. విచారణకు రాకపోవడానికి కాంగ్రెస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగే కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీలో స్పీకర్ ఎదుట జరిగిన విచారణకు హాజరైన ఆయన.. అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ విచారణకు ఇటు దానం, అటు మహేశ్వర్ రెడ్డి ఇద్దరూ రాకపోవడం చూస్తుంటే, వారు ములాఖత్ అయినట్లు తెలుస్తోందని ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు తన నియోజకవర్గంలో కూడా శుక్రవారమే చివరి రోజు అని, మరి తాను విచారణకు హాజరయ్యానని, మహేశ్వర్ రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వారిద్దరి తరఫున అడ్వకేట్లు మాత్రమే హాజరయ్యారని తెలిపారు. దానంపై అనర్హత పిటిషన్‌కు సంబంధించిన ఆధారాలను స్పీకర్‌కు ఇచ్చినట్లు చెప్పారు. ఆయన ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, సికింద్రాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ తరఫున పోటీ చేశారని, ఆయన పార్టీ మారాడని అనడానికి ఇంతకన్నా పెద్ద ఆధారం ఏముంటుందని ప్రశ్నించారు.
