- మెంటల్ ట్రీట్మెంట్ తీసుకొని ఇటీవలే ఇంటికొచ్చిన భర్త
వికారాబాద్, వెలుగు: భార్యాభర్తల మధ్య వివాదం జరగడంతో భార్యను భర్త పారతో తలపై కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ తండాలో జరిగింది. పెద్దేముల్ ఎస్సై శంకర్ తెలిపిన ప్రకారం.. పెద్దేముల్ తండాకు చెందిన మూడవత్ రవికి 15 ఏండ్ల కింద అనిత(28)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రవి మతిస్థిమితం కోల్పోయి కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఆయనను తిరిగి ఇటీవలే ఇంటికి తీసుకువచ్చి ట్రీట్మెంట్ చేయించారు. ఆదివారం రవి, అనిత మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రవి పార తీసుకొని భార్య అనిత తలపై గట్టిగా కొట్టాడు. తీవ్రగాయాలతో ఆమె స్పాట్లో చనిపోయింది. మృతిరాలి సోదరుడు కేతావత్ క్రిష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, తాండూర్ రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్సై శంకర్ పరిశీలించారు.
