
మేడ్చల్, వెలుగు: తాగి వచ్చి నిత్యం వేధిస్తుండడంతో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. మేడ్చల్ పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస్(45) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తరచూ మద్యం తాగి వచ్చి భార్య సావిత్రిని వేధిస్తున్నాడు. బుధవారం ఆమెతో గొడవపడ్డాడు. దీంతో సావిత్రి క్షణికావేశంలో కర్రతో భర్తపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు.
బోరబండలో మరో ఘటన..
జూబ్లీహిల్స్ : వృద్ధ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో భర్తను భార్య హత్య చేసింది. బోరబండ ఎస్పీఆర్ హిల్స్, రాజీవ్‌గాంధీ నగర్లో నివాసముండే బాలస్వామి(60), లక్ష్మి(54) దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో లక్ష్మి సుత్తితో బాలస్వామి తలపై బాది హత్య చేసింది. వీరి కుమారుడు వెంకటేశ్ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.