- అదుపులోకి తీసుకున్న పోలీసులు
వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ సిటీలో ఓ మహిళ కత్తితో హల్ చేసింది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ కత్తితో దాడికి యత్నించింది. భయంతో ఆయన షాపులోపలికి వెళ్లి దాక్కున్న ఘటన ఇంతేబజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ డాక్టర్స్ కాలనీకి చెందిన మెరుగు శ్రీకాంత్, జ్యోత్స్న దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొన్నేండ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుండగా విడాకుల కోసం శ్రీకాంత్ కోర్టును ఆశ్రయించాడు. జ్యోత్స్నమాత్రం నిరాకరిస్తోంది.
కాగా.. శ్రీకాంత్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని జ్యోత్స్నఆరోపిస్తూ కత్తితో బుధవారం మధ్యాహ్నం వరంగల్ చౌరస్తాకు చేరుకుంది. అక్కడ భర్త నిర్వహించే వైష్ణవి జువెలరీ షాప్ లోకి వెళ్లింది. ఆమె చూసి అప్రమత్తమైన శ్రీకాంత్ షాపులోపలికి వెళ్లి దాక్కొని పోలీసులకు ఫోన్ చేశాడు. తన భర్త చిక్కకపోవడంతో ఆమె రోడ్డుపై బైఠాయించింది. పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకొని ఆమె వద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
