అమ్మా.. లేమ్మా ఒక్కసారి కళ్లు తెరవమ్మా!...ఊరి బయట తల్లి శవం వద్ద రాత్రంతా మూడేండ్ల చిన్నారి రోదన

అమ్మా.. లేమ్మా ఒక్కసారి కళ్లు తెరవమ్మా!...ఊరి బయట తల్లి శవం వద్ద రాత్రంతా మూడేండ్ల చిన్నారి రోదన
  •     తలపై బండతో కొట్టి చంపేసిన భర్త!
  •     షాద్ నగర్ లో ఘటన 

శంషాబాద్, వెలుగు: చుట్టూ చీకటి.. రాత్రి వేళ నిర్మానుష్య ప్రదేశంలో నిర్జీవంగా పడి ఉన్న తల్లి. బూచాడు పట్టుకుపోతాడేమోనన్న భయం. అమ్మకు ఏమైందో తెలియని స్థితిలో తల్లి శవంపై పడి తెల్లారే వరకు ఏడుస్తూనే ఉందా చిన్నారి. ఉదయం వేళ ఎవరో అటుగా రావడంతో చిన్నారి ఏడుపు విని వెళ్లి చూడగా మహిళ శవం కనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా ఆమె తెలిసిన మహిళనే. 

దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఆ వ్యక్తి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​పరిధిలో జరిగింది.  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం దేవునిపల్లి గ్రామపంచాయతీ రంగారెడ్డిగూడకు చెందిన పోతుల శోభారాణి (30) కి మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ గ్రామానికి చెందిన రాజుతో పదేండ్ల క్రితం పెండ్లి జరిగింది. వీరికి మహేందర్ (7) అనే కొడుకు ఉన్నాడు. వీరి వైవాహిక జీవితం కొన్నేండ్ల పాటు సాఫీగా సాగింది. కొన్ని విషయాలకు సంబంధించి భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఇద్దరూ విడిపోయారు. దీంతో కోయిల్‌‌కొండకే చెందిన నర్సింహులుతో శోభారాణికి పరిచయం ఏర్పడగా అది  ప్రేమగా మారింది. 

నాలుగేండ్ల కింద ఇద్దరూ పెండ్లి చేసుకున్నారు. వీరికి రెండున్నరేండ్ల మమత అనే కూతురు ఉంది. కొన్ని నెలలుగా శోభ, నర్సింహులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో శోభ.. రంగారెడ్డిగూడలోకి పుట్టింటికి వచ్చింది. నర్సింహులు అప్పుడప్పుడు మద్యం తాగి వచ్చి గొడవలు చేస్తుండేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి పది గంటలకు నర్సింహులు .. శోభకు ఫోన్​చేసి ఆమె కొడుక్కి సైకిల్  ఇస్తానని చెప్పాడు. దీంతో ఆమె  తన బిడ్డ మమతతో కలిసి నర్సింహులును కలవడానికి మహబూబ్​నగర్​ వెళ్లింది.  

చిన్నారి ఏడుపులు విని..

ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు దేవునిపల్లి గ్రామస్తుడు ఎరుకలి గోవిందు పొలం పనికి వెళ్తూ శివారులోని ఒక పొలంలో శోభ మృతదేహాన్ని చూశాడు. అక్కడ ఆమె కూతురు ఏడుస్తూ కనిపించింది. ఈ విషయాన్ని గోవిందు.. మృతురాలి తల్లికి చెప్పాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎవరో ఆమె తలపై బండరాయితో మోది చంపినట్టు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం కోసం పంపించారు. నర్సింహులే తన బిడ్డను హత్య చేసి ఉంటాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాద్​నగర్​ సీఐ కే సీతారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.