
- సిద్దిపేట జిల్లా ములుగులో ఘటన
ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ములుగు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో చివరి నిమిషంలో అంత్యక్రియలు నిలిచిపోయాయి. వివరాలిలా ఉన్నాయి.. ములుగు గ్రామానికి చెందిన బుడిగే నరేశ్(35) శుక్రవారం అదే గ్రామానికి చెందిన కురుమ జహంగీర్ పొలానికి గడ్డి మందు కొట్టేందుకు వెళ్లాడు. పొలంలో పని చేస్తుండగా హఠాత్తుగా కింద పడిపోవడంతో నరేశ్‌ను ముందుగా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తరువాత హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం చనిపోగా, డెడ్ బాడీని ములుగుకు తీసుకొచ్చారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో మృతుడి భార్య బంధువులతో కలిసి నరేశ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.