అత్తమామలతో కలిసి భార్య ప్రియుడిని చంపిన భర్త

అత్తమామలతో కలిసి భార్య ప్రియుడిని చంపిన భర్త

మంచిర్యాల/చెన్నూర్, వెలుగు : మంచిర్యాల జిల్లాలో వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపిన వివరాల ప్రకారం.. పొన్నారం గ్రామానికి చెందిన బట్టే శేఖర్(35)కు, చెన్నూరు మండలం కమ్మరిపల్లికి చెందిన పద్మ(30)కు కొన్నేండ్ల కింద వివాహమైంది. అయిదేండ్లుగా పొన్నారం గ్రామానికి చెందిన రామగిరి మహేందర్​(29)తో పద్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో నాలుగు నెలల కింద ఇద్దరూ ఊరి నుంచి పారిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చెన్నూరు పోలీసులు పద్మ మిస్సింగ్ కేసు చేశారు.

ఆ తర్వాత తిరిగి వచ్చిన పద్మ, మహేందర్​పొన్నారంలోనే ఒకే ఇంట్లో ఉంటున్నారు. నెల కింద వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పద్మ పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఎత్తుకెళ్లినప్పటి నుంచి మహేందర్​పై కక్ష పెంచుకున్న పద్మ భర్త శేఖర్.. అతన్ని చంపాలని స్కెచ్​వేశాడు. మంగళవారం రాత్రి ప్లాన్​ప్రకారం మహేందర్​ను కమ్మరిపల్లిలోని అత్తగారింటికి పిలిపించాడు. అత్తమామలు మొగిలి ఓదెలు, సుగుణక్కతో కలిసి కర్రలతో కొట్టి చంపారు. అనంతరం డెడ్ బాడీని శేఖర్, ఓదెలు ఎడ్ల బండిలో గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చేశారు. గ్రామంలోని పలువురి ద్వారా విషయం తెలుసుకున్న మహేందర్ సోదరుడు రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరార్​అవడానికి చెన్నూర్ బస్టాండుకు చేరుకున్న శేఖర్, పద్మ, ఓదెలు, సుగుణక్కను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

బెల్లంపల్లిలో భర్తపై గొడ్డలితో దాడి..

బెల్లంపల్లి :  బెల్లంపల్లి టౌన్​లోని ఇంట్లో నిద్రపోతున్న భర్తపై ఓ భార్య గొడ్డలితో దాడి చేసింది. వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ ఎన్.దేవయ్య, ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి బస్తీకి చెందిన బూరుగు శంకర్(46), లత భార్యాభర్తలు. శంకర్ వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని లత కొన్నాళ్లుగా అనుమానిస్తోంది. ఈ విషయంలో ఇద్దరూ పలుమార్లు గొడవపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల ప్రాంతంలో నిద్రపోతున్న శంకర్​పై లత గొడ్డలితో దాడి చేసింది. తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి కరీంనగర్ కు తరలించారు. బాధితుడి తల్లి బుచ్చమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్​స్పెక్టర్ తెలిపారు.