
- తండ్రి, తమ్ముడితో కలిసి హత్య, వాగులో పూడ్చివేత
- ఆరు రోజుల కింద ఘటన, మృతుడి తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి..
- మహబూబ్‌నగర్ జిల్లా కురుమూర్తిలో ఘటన
చిన్నచింతకుంట, వెలుగు : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తన తండ్రి, తమ్ముడితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేసింది. అనంతరం వాగులో పూడ్చి పెట్టింది. మూడు రోజుల నుంచి కొడుకు కనిపించకపోవడంతో మృతుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మహిళను, ఆమె తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేయగా హత్య చేసి, వాగులో పూడ్చివేసినట్లు ఒప్పుకున్నారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామంలో వెలుగు చూసింది.
కురుమార్తి గ్రామానికి చెందిన గాయత్రికి మూసాపేట మండలం వేముల గ్రామానికి బండారి సాయిలు (37)తో 17 ఏండ్ల కింద వివాహమైంది. గాయత్రికి వివాహేతర సంబంధం ఉండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో గాయత్రి భర్తను వదిలి పిల్లలతో కలిసి కురుమూర్తికి వచ్చి తల్లిదండ్రులతో ఉంటోంది. భర్త వచ్చి నచ్చజెప్పి తీసుకెళ్లినా కొన్ని రోజులకు మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వచ్చేది. ఈ క్రమంలో జనవరిలో కూడా ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. ఈ టైంలో ఇల్లు, భూమి తన పేరున రాయాలని గాయత్రి ఒత్తిడి చేయడంతో రిజిస్ర్టేషన్ చేయించాడు.
తర్వాత మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. ఈ నెల 10న గాయత్రి సాయిలుకు ఫోన్ చేసి కురుమూర్తికి రావాలని పిలిచింది. సాయిలు వచ్చిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో తండ్రి డోలు వెంకటన్న, తమ్ముడు శ్రీకృష్ణతో కలిసి సాయిలుపై కట్టెలతో దాడి చేసి హత్య చేసింది. తర్వాత డెడ్‌బాడీని మోపెడ్‌పై తీసుకెళ్లి గ్రామ శివారులోని ఊక చెట్టు వాగు వద్ద పూడ్చిపెట్టారు. అయితే మూడు రోజులైనా సాయిలు కనిపించకపోవడంతో అతడి తండ్రి బండారి కృష్ణయ్య చిన్నచింతకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఎస్సై శేఖర్ గాయత్రి, వెంకటన్నను స్టేషన్‌కు పిలిపించి ఎంక్వైరీ చేయగా సాయిలును తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో శుక్రవారం జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్, ఎస్సైలు శేఖర్, నాగన్న సిబ్బందితో వెళ్లి డెడ్‌బాడీని బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం మహబూబ్‌నగర్ హాస్పిటల్‌కు తరలించారు. గాయత్రి, వెంకటన్న అరెస్ట్ చేశామని, మరో నిందితుడు శ్రీకృష్ణ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు.