అందుకు భార్య నిరాకరిస్తే.. భర్త విడాకులు తీసుకోవచ్చు: మధ్యప్రదేశ్ హైకోర్టు

అందుకు భార్య నిరాకరిస్తే.. భర్త విడాకులు తీసుకోవచ్చు: మధ్యప్రదేశ్ హైకోర్టు

ఓ జంట విడాకుల కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్య వివాహాన్ని రద్దు చేయడానికి లేదా సరైన కారణం లేకుండా భర్తతో శృంగారంలో పాల్గొనడానికి నిరాకరించడం మానసిక క్రూరత్వానికి సమానమని పేర్కొంది. ఈ కారణం హిందూ వివాహ చట్టం ప్రకారం సదరు భర్త.. భార్య నుంచి విడాకులు తీసుకోవడానికి  దారి తీస్తుందని వ్యాఖ్యానించింది.

ఏంటి ఈ కేసు..?

భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి జులై 12, 2006న వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి 2006 జూలై 28 వరకు అనగా దాదాపు 16 రోజులపాటు భార్య అతన్ని ముట్టనివ్వలేదు. దీంతో విసిగిపోయిన సదరు భర్త విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. పేరుకేమో పెళ్లైందని.. కానీ తాను భారతదేశం విడిచి వెళ్లే వరకు భార్య తనను ముట్టనివ్వలేదని.. ఈ కారణం చేత తనకు విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే అతని వాదనను ఫ్యామిలీ కోర్టు అంగీకరించలేదు. విడాకులు మంజూరు చేయడానికి ఇది సరైన కారణం కాదని చూపుతూ 2014 నవంబర్‌‌లో పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించారు.

దీన్ని విచారణకు స్వీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. సరైన కారణం లేకుండా భార్య తన భర్తతో శృంగారంలో పాల్గొనడానికి నిరాకరించడం మానసిక క్రూరత్వానికి సమానమని తెలిపింది. ఇది సరైన కారణం కాదని గతంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు తప్పని వ్యాఖ్యానించింది. తన భర్త వివాహా అనంతరం భారతదేశాన్ని విడిచిపెడతాడని సదరు మహిళకు తెలుసునని, అయినప్పటికీ ఆమె తమ కార్యంలో పాల్గొనడానికి నిరాకరించిందని పేర్కొంది.

"ఎటువంటి శారీరక అసమర్థత లేదా సరైన కారణం లేకుండా ఎక్కువ కాలం పాటు లైంగిక సంపర్కం చేయడానికి ఏకపక్షంగా నిరాకరించడం మానసిక క్రూరత్వానికి దారితీస్తుందని తాము అర్థం చేసుకున్నట్లు బెంచ్ వ్యాఖ్యానించింది.." న్యాయమూర్తులు షీల్ నాగు, వినయ్ సరాఫ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పిచ్చింది.