భార్యాబిడ్డను చంపిన వ్యక్తికి జీవిత ఖైదు .. శిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా కోర్టు

భార్యాబిడ్డను చంపిన వ్యక్తికి జీవిత ఖైదు .. శిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా కోర్టు

చేవెళ్ల, వెలుగు: భార్యను, కూతురిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ ఎల్​బీనగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. చేవెళ్ల సీఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల గ్రామానికి చెందిన ఎరుకలి రాజు అదే ఊరికి చెందిన రోజాను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. రాజు పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పెళ్లి తర్వాత దొంగతనాలు మానుకుంటాడని రోజా భావించింది. అయితే ఆ తర్వాత కూడా అతడు చోరీలుచేస్తుండటంతో భార్య గొడవపడేది. 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం రోజా మరోసారిభర్త రాజుతో గొడవపడింది. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది.

దీంతో రాజు భార్య రోజాపై, 6 నెలల కూతురు కీర్తనపై కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియాకు తరలించారు. అక్కడ ట్రీట్​మెంట్ తీసుకుంటూ చిన్నారి కీర్తన చనిపోగా.. మూడ్రోజుల తర్వాత రోజా కూడా మృతిచెందింది. పోలీసులు రాజును అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించారు. కేసు విచారణలో భాగంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా కోర్టు అతడికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల ఫైన్ విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే, అంతకుముందే పలు దొంగతనాల కేసుల్లో అతడు దోషిగా తేలడంతో 20 ఏండ్ల జైలు శిక్ష పడినట్లు సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు.