యథేచ్ఛగా వన్యప్రాణుల వేట..ఉచ్చులు, కరెంటు తీగలు, నాటు తుపాకులతో చంపుతున్న వేటగాళ్లు

యథేచ్ఛగా వన్యప్రాణుల వేట..ఉచ్చులు, కరెంటు తీగలు, నాటు తుపాకులతో చంపుతున్న వేటగాళ్లు
  • తాజాగా అశ్వాపురం మండలంలో దుప్పి మాంసం స్వాధీనం
  • గతంలో దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో వన్యప్రాణుల మాంసం అమ్మకాల కలకలం
  • పలువురి అరెస్టు, కేసుల నమోదు.. అయినా మారని వేటగాళ్లు.. 
  • బేస్​క్యాంపులు పెట్టి పెట్రోలింగ్​పెంచామంటున్న అధికారులు 

భద్రాచలం, వెలుగు :  అడవుల జిల్లా భద్రాద్రికొత్తగూడెంలో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. ఉచ్చులు, కరెంటు తీగలు, నాటు తుపాకులతో వేటగాళ్లు అడవుల్లో వేటాడుతూ వాటి మాంసం అమ్ముతున్నారు. అడవి మాంసానికి గిరాకీ ఉండటంతో వేటగాళ్ల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. శనివారం అశ్వాపురం మండలంలో దుప్పిని వేటాడి, మాంసాన్ని విక్రయిస్తుండగా అటవీ సిబ్బంది పట్టుకున్నారు. 

ఈ ఏడాది దమ్మపేట, ములకలపల్లి మండాలాల్లోనూ వన్యప్రాణుల వేట, మాంసం అమ్మకాలు కలకలం రేపాయి. శీతాకాలం, వేసవికాలాల్లోనే ఈ వేట ఎక్కువగా జరుగుతుంది. 

అడవుల్లో ఉచ్చులు.. 

ఎక్కువగా ఉచ్చులు పెట్టి వన్యప్రాణులను వేటాడుతున్నారు. అడవుల మీదుగా విద్యుత్​ లైన్లు వెళ్తున్న ప్రాంతంలో తీగల ఉచ్చులు రాత్రి వేళల్లో పెడుతున్నారు. ఆహారం కోసం బయటకు వచ్చిన సమయంలో చుక్కల దుప్పులు, అడవి పందులు, కుందేళ్లు వీటికి తగిలి చనిపోతున్నాయి. పంటల చుట్టూ కంచెలు కట్టి, ఒక్కచోట మాత్రమే గ్యాపు ఉంచుతారు. 

ఆ ప్రాంతంలో వైర్లతో ఉచ్చులు పెడతారు. మొక్కజొన్న లాంటి పంట చేలల్లోకి వచ్చిన అడవి జంతువులు ఆ ఉచ్చుల్లో పడి వేటగాళ్ల చేతచిక్కుతున్నాయి. రాత్రి వేళల్లో అడవుల్లోకి వేటగాళ్లు వెళ్లి బ్యాటరీ లైట్లతో కుందేళ్ల వేట చేస్తున్నారు. ఇలా తెచ్చిన మాంసానికి పట్టణాల్లో గిరాకీ ఉంటోంది. ప్రత్యేకంగా ఒక ప్లాస్టిక్​ సంచిలో మూటలు కట్టి వాటిని అమ్ముతున్నారు. 

భద్రాచలం, అశ్వాపురం, మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేటలకు వీటిని తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. భద్రాచలం లాంటి ప్రాంతాలకు బూర్గంపాడు, -అశ్వాపురం మండలాల మధ్యలో ఉన్న కృష్ణసాగర్​ అటవీ ప్రాంతం నుంచి అడవి జంతువుల మాంసం వస్తోంది.

ఈ ఏడాది అనేక ఘటనలు.. 

ఈ ఏడాది వన్యప్రాణుల వేట ఘటనలు ఎక్కువగానే వెలుగు చూశాయి. 

 ఏప్రిల్​లో దమ్మపేటలో దుప్పిని వేటాడి వండుతుండగా ఫారెస్ట్ ఆఫీసర్లు దాడి చేసి పట్టుకుని, నలుగురిపై కేసు నమోదు చేశారు. 

 పాల్వంచ మండలం సోములగూడెంలో దుప్పిని వేటాడిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. 
 ములకలపల్లి రామాంజనేయపురంలో విద్యుత్​వైర్లు పెట్టి అడవిపందిని చంపారు. మంగపేట ప్రాంతంలో దీన్ని ఖననం చేశారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేయగా, ఐదుగురు వేటగాళ్లు పరారయ్యారు. 

జూన్​ లో చాపరాలపల్లిలో నాటుతుపాకీతో వేటాడుతున్న నలుగురిని అరెస్ట్ చేశారు. 

తాజాగా అశ్వాపురం మండలం మిట్టగూడెం ప్రాంతంలో శనివారం దుప్పి మాంసంతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మాంసం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 

దంతెలబోరు, ఏడూళ్లబయ్యారం, ఇల్లెందు ఏరియాల్లో రెండేండ్లలో చాలా కేసులు నమోదయ్యాయి. 

రెండున్నరేండ్ల కింద పాల్వంచ మండలం ఉల్వనూరు అడవుల్లో ఎలుగుబంటిని వేటాడి చంపిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదైంది. అలుగును వేటాడే ముఠాను అరెస్ట్ చేశారు.

వేటగాళ్లపై ఫోకస్​ పెట్టాం

వన్యప్రాణుల వేటను నియంత్రించేందుకు వేటగాళ్లపై ఫోకస్​ పెట్టాం. బేస్​ క్యాంపులు పెట్టి పెట్రోలింగ్​పెంచాం. వేటగాళ్ల కదలికలు, వారి రాకపోకల వివరాలు స్థానికంగా సేకరిస్తున్నాం. అడవి జంతువులను వధిస్తే ఏడేండ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. పులుగులు, ఎలుగుబంట్లు, దుప్పులు, నెమళ్లు, చిరుతపులులు, కోతులను పట్టుకున్నా , కుందేళ్లను చంపినా కఠినమైన చట్టాలు ఉన్నాయి. బెయిల్​ కూడా దొరకని సెక్షన్లు ఉన్నాయి.  - బాబు, ఎఫ్​డీవో, వైల్డ్ లైఫ్​