కార్చిచ్చులకు 1.7 కోట్ల మూగజీవులు ఆహుతి

కార్చిచ్చులకు 1.7 కోట్ల మూగజీవులు ఆహుతి
  • ప్యాంటనాల్ నేచురల్ రీజియన్​లో సైంటిస్టుల రీసెర్చ్​
  • 39,030 చదరపు కిలోమీటర్ల మేర లెక్క తీసిన సైంటిస్టులు
  • పక్షులు, పాములు, కొవాలాల వంటి జీవులు చనిపోయినట్టు వెల్లడి

ప్యాంటనాల్:  ఒకటా..రెండా.. ఏటా కొన్ని వందల కార్చిచ్చులు అడవులను కాల్చేస్తున్నాయి. కొన్ని లక్షల చెట్లను బూడిద చేస్తున్నాయి. ఎన్నో మూగజీవాల ఉసురును తీస్తున్నాయి. కార్చిచ్చులతో మన క్లైమేట్​కు ఎంత నష్టం జరుగుతోందన్న దానిపై లెక్కలేస్తున్న సైంటిస్టులు.. ఆ మంటల్లో ఎన్ని జీవాలు చచ్చిపోతున్నాయన్నది మాత్రం లెక్కించట్లేదు. తాజాగా బ్రెజిల్​కు చెందిన కొందరు సైంటిస్టులు ఆ ప్రయత్నమే చేశారు. నిరుడు బ్రెజిల్​లో జరిగిన కార్చిచ్చు ఘటనల్లో చనిపోయిన జీవజాతుల లెక్కలను తీశారు. 39,030 చదరపు కిలోమీటర్ల మేర ఒక్క ప్యాంటనాల్ వెట్​ల్యాండ్స్​ (చిత్తడి నేలలు)లోనే 1.7 కోట్ల అటవీ జంతువులు చనిపోయినట్టు లెక్కతేల్చారు. పక్షులు, పాములు, కొవాలాలు, ఇతరత్రా జంతువులు మంటల్లో బుగ్గయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క బ్రెజిల్​లోనే ఇన్ని కోట్ల జంతువులు చనిపోయి ఉంటే ప్రపంచవ్యాప్తంగా రగులుతున్న కార్చిచ్చుల్లో ఇంకెన్ని జంతువులు చనిపోయి ఉండాలని సైంటిస్టులు ప్రశ్నిస్తున్నారు. 

బయోడైవర్సిటీకి నష్టం 

కార్చిచ్చుల వల్ల ఇటు జంతువులు, అటు అరుదైన, మెడిసినల్ గుణాలున్న చెట్లు, మొక్కలను కోల్పోవాల్సి వచ్చిందని, ఫలితంగా బయోడైవర్సిటీ (జీవవైవిధ్యం)పై పెద్ద దెబ్బ పడిందని సైంటిస్టులు పేర్కొన్నారు. పదే పదే కార్చిచ్చులు చెలరేగడం వల్ల ఎకోసిస్టమ్స్ (పర్యావరణ వ్యవస్థలు) దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అడవులు తగలబడిపోవడం బాగా పెరిగిందని, దాని తీవ్రత కూడా ఎక్కువగానే ఉందంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లక్షల హెక్టార్లలో అడవులు కాలిపోతున్నాయంటున్నారు. ఒక్క బ్రెజిల్ లోని ప్యాంటనాల్ లోనే 2019లో 16,210 చదరపు కిలోమీటర్ల మేర అడవులు కాలి బుగ్గయిపోతే.. 2020లో అది 39,030 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని చెబుతున్నారు. మనిషి చేస్తున్న పనుల వల్లే ఎక్కువ కార్చిచ్చు ఘటనలు జరుగుతున్నా.. వర్షాలు పడకపోవడం, టెంపరేచర్లు పెరగడం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల కూడా కార్చిచ్చులు పెరుగుతున్నాయని సైంటిస్టులు పేర్కొన్నారు.