
రెండున్నరేళ్ల క్రితమే ప్రారంభిస్తామని ప్రకటించిన కేంద్రం
ఇప్పటికీ అడుగు ముందుకు పడని వైనం
ఈఎస్ఐలోకి చేర్చాలంటున్న ఆటోవాలాలు
హైదరాబాద్, వెలుగు: ఈఎస్ఐ పథకంలో తమను ఎప్పుడూ చేర్చుతారంటూ ఆటో డ్రైవర్లు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అసంఘటిత రంగంలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఈఎస్ఐ పథకాన్ని అమలు చేయాలని 2015లోనే కేంద్రం నిర్ణయించింది. 2016 నుంచి ఆటో డ్రైవర్లను ఈ పథకంలో భాగం చేస్తామని నాటి కేంద్ర కార్మిక సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. దీంతో గ్రేటర్ పరిధిలోని ఆటో డ్రైవర్లు ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఈ పథకాన్ని ప్రకటించి రెండున్నరేళ్లు అవుతున్నా అడుగు ముందుకు పడకపోవటంతో ఆటోడ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. తమను ఈఎస్ ఐ పథకంలో ఎప్పుడు చేర్చుతారని ప్రశ్నిస్తున్నారు. నిజానికి అసంఘటిత రంగంలో ఉన్న ఆటో డ్రైవర్లను ఈఎస్ఐ చేర్చాలనేది చాలా మంచి నిర్ణయం. ఐతే మొదట్లో హడావుడీ చేసిన కేంద్రం పెద్దలు ఆ తర్వాత ఆ ఊసే ఎత్తటం లేదు. బండారు దత్తాత్రేయ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే విషయంలో ఎవరూ చొరవ చూపలేదు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టటంతో తమ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు.
5 లక్షల మందికి ప్రయోజనం…
ఆటో డ్రైవర్లను ఈఎస్ఐ అమలు చేస్తే గ్రేటర్ పరిధిలోనే 5 లక్షల మందికి మేలు జరుగనుంది. గ్రేటర్ పరిధిలో దాదాపు లక్షా 34 వేల మందికి పైగా ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుటుంబాలతో కలుపుకుంటే దాదాపు 5 లక్షల మంది ఉంటారు. వీరికి ఆరోగ్య భద్రత అన్నదే లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యానికి అయ్యే ఖర్చు వారు భరించే స్థితిలో లేరు. ఇలాంటి వారికి ఈఎస్ఐ ఆరోగ్య భరోసా ఇస్తుంది. ఈ పథకంలో చేరేందుకు నెలకు 1,500 రూపాయలు చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ఈఎస్ఐ పథకంలో చేరే వారు స్థానిక ఈఎస్ఐ డిస్పెన్సరీలో పేరు నమోదు చేసుకుంటే వారికి కార్డును అందజేస్తారు. ఈ కార్డు ఉన్న వారు సూపర్ స్పెషాలిటీ వైద్యం పొందొచ్చు.
హడావుడిగా కొంతమందికి కార్డులు…
మొదటి సారి ఢిల్లీలో ఈ పథకాన్ని అమలు చేసి ఆ తర్వాత హైదరాబాద్ లో పైలట్ పథకంగా అమలు చేయాలనుకున్నారు. ఇక్కడ విజయవంతమైతే అన్ని ప్రధాన నగరాల్లోనూ ఆటో డ్రైవర్లకు ఈఎస్ఐ అందుబాటులోకి తేవాలనుకున్నారు. హడావుడిగా కొంతమంది ఆటోడ్రైవర్లకు అప్పట్లోనే ఈఎస్ఐ కార్డులను జారీ చేశారు. కానీ ఇప్పటి వరకూ దీని అమలు చేయడంలో శ్రద్ధ చూపడం లేదు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో ఆటో డ్రైవర్లు నిరాశలో ఉన్నారు. హైదరాబాద్ లో ఆటో నడుపుకునే వారికి కుటుంబ పోషణే భారంగా ఉందని..వారికి ఆరోగ్య సమస్య వస్తే అప్పులు పాలవటం ఖాయమని వాపోతున్నారు.
పథకం అమలుపై కేంద్రం దృష్టి పెట్టాలి
ఈఎస్ఐ పథకం ప్రకటించగానే హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లంతా ఎంతో సంతోషించాం. కానీ రెండున్నరేళ్లుగా దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. మాకు ఆరోగ్య భద్రత కల్పించాలి. ఆటో నడపటం ద్వారా వచ్చే డబ్బు కుటుంబ పోషణకే సరిపోవడం లేదు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే మా పరిస్థితి దయనీయంగా ఉంటుంది. దయచేసి ఆటో డ్రైవర్లకు ఈఎస్ఐ పథకం అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. – (షరీఫ్, ఆటో డ్రైవర్)