బీసీసీఐకి ఇక కష్టమేనా?.. కొత్త స్పోర్ట్స్ యాక్ట్ అమలుపై సుప్రీంకోర్టు ఫోకస్!

బీసీసీఐకి ఇక కష్టమేనా?.. కొత్త స్పోర్ట్స్ యాక్ట్ అమలుపై సుప్రీంకోర్టు ఫోకస్!

BCCI and New Sports Law: ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బీసీసీఐ (BCCI) కి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. దేశంలోని క్రీడా సమాఖ్యల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ 2025 (National Sports Governance Act 2025) పరిధిలోకి బీసీసీఐతో పాటు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు ఎందుకు రాకూడదో చెప్పాలని సీజేఐ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నిర్ణయం కనుక అమలులోకి వస్తే భారత క్రికెట్ బోర్డు ఆర్థిక, పాలనా వ్యవహారాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిఘా నీడలోకి వచ్చే అవకాశం ఉంది. 

సుప్రీం ధర్మాసనం కీలక ప్రశ్నలు: 

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బీసీసీఐ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక అంశాన్ని లేవనెత్తింది. క్రీడా సంస్థల్లో అవకతవకలను అరికట్టడానికి ఈ చట్టంలో రెండు ప్రధాన వ్యవస్థలు ఉన్నాయి. క్రీడా సంస్థల అడ్మినిస్ట్రేషన్ పద్ధతులను ప్రామాణీకరించే కేంద్ర పాలక మండలి.. స్పోర్ట్స్ గవర్నెన్స్ వివాదాలను పరిష్కరిస్తూ, చట్ట నిబంధనలు పాటించేలా చూసే ప్రత్యేక న్యాయస్థానం.

ఆర్టీఐ (RTI) కిందకు లెక్కలు వస్తాయనే బీసీసీఐ భయం: 

బీసీసీఐ మొదటి నుంచి ప్రభుత్వ చట్టాల పరిధిలోకి రావడానికి ఒప్పుకోవడం లేదు.. మేము ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు లేదా గ్రాంట్లు తీసుకోవడం లేదు.. కాబట్టి ప్రభుత్వ క్రీడా చట్టాలకు లోబడి పని చేసే బాధ్యత మాకు లేదని బీసీసీఐ ప్రధాన వాదన. ఒకవేళ ఈ కొత్త చట్టాన్ని అంగీకరిస్తే బీసీసీఐ ఆర్థిక లావాదేవీలు, అంతర్గత నిర్ణయాలన్నీ సమాచార హక్కు చట్టం (RTI Act) కిందకు వచ్చి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తాయి. అందుకే గతంలో ఒడిశా హైకోర్టులోనూ క్రికెట్ అనేది చట్ట ప్రకారం నోటిఫై చేయబడిన క్రీడ కాదంటూ బీసీసీఐ మినహాయింపు కోరింది.

లోధా కమిటీ రూల్స్ వర్సెస్ కొత్త చట్టం: 

ప్రస్తుతం బీసీసీఐ సుప్రీంకోర్టు ఆమోదించిన లోధా కమిటీ రికమండేషన్ల ప్రకారమే నడుస్తోంది. దీని ప్రకారం ఒక ఆఫీస్ బేరర్ వరుసగా రెండేసి టర్మ్‌లు (రాష్ట్ర స్థాయి, బీసీసీఐ స్థాయిలో చెరో 6 ఏళ్లు) పూర్తి చేసుకుంటే తప్పనిసరిగా మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్పోర్ట్స్ యాక్ట్ కనుక వర్తిస్తే, బీసీసీఐపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ తగ్గి కేంద్ర నిబంధనలే చెల్లుబాటయ్యే ఛాన్స్ ఉంది. దీంతో బీసీసీఐ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరి ఈ చట్టంపై సుప్రీంకోర్టుకు భారత క్రికెట్ బోర్డు ఎలాంటి సమాధానమిస్తుందో చూడాలి మరీ.