పరిహారం ఇవ్వకపోతే ‘చెట్టినాడ్’ను మూసేయిస్తా.. రానున్న రోజుల్లో రైల్వే మినిస్టర్ అవుతా

పరిహారం ఇవ్వకపోతే ‘చెట్టినాడ్’ను మూసేయిస్తా.. రానున్న రోజుల్లో రైల్వే మినిస్టర్ అవుతా
  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజకీయాలకు సూట్​ కారు..చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి  

వికారాబాద్​, వెలుగు:  తాండూరు మండలంలోని సంగెం కలాన్ లో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు వద్ద నిర్మించిన చెట్టినాడ్​సిమెంట్ ఫ్యాక్టరీ వెదజల్లే కాలుష్యంతో పంటలు దెబ్బతిని, రైతులు నష్టపోతున్నారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి అన్నారు.

 బాధితులకు పరిహారం చెల్లించకపోతే ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపట్టి, మూసేయిస్తామని యాజమాన్యాన్ని ఫోన్​లో హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సంగం కలాన్ గ్రామ రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఎంపీగా తాను మర్పల్లిలో ఇంటర్ సిటీ రైలు ఆపేందుకు కృషి చేశానని, బషీరాబాద్ లో రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైలును ఆపాలని రైల్వే బోర్డును కోరినట్లు తెలిపారు. 

రానున్న రోజుల్లో తాను రైల్వే మినిస్టర్ అవుతానని, ఇక్కడి రైల్వే సమస్యలను పరిష్కరిస్తానన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం చెప్పినట్లు కాంగ్రెస్ నడుచుకుంటోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాభవం కోల్పోయిందన్నారు. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి 90 వేలకు పైగా ఓట్లు రాబడుతామని ధీమా వ్యక్తం చేశారు. 

పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్​రెడ్డి తన మనిషే అయినప్పటికీ.. ఆయన రాజకీయాలకు సూట్ కారన్నారు. అందరినీ కలుపుకోవాలని చెప్పినా పరిస్థితిలో మార్పు రాలేదని పేర్కొన్నారు. అనంతరం ధారూర్​మండలంలోని నాగారంలో బీఎస్ఎన్ఎల్​టవర్​ను ప్రారంభించారు. మాజీ ఎంపీపీ బాలేశ్వర్​గుప్త, దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, రమేశ్​కుమార్, నాయకులు పాల్గొన్నారు.