న్యూఢిల్లీ: రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయొద్దన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలను ఇండియా, రష్యా లైట్ తీసుకున్నాయి. ఈ క్రమంలో ఇండియాకు ముడి చమురు సరఫరాపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఇండియాకు రష్యా నుంచి చమురు సరఫరా యధావిధిగా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన పుతిన్ శుక్రవారం (డిసెంబర్ 5) ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అనంతరం పుతిన్, మోడీ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. అమెరికా నుంచి వాణిజ్య ఒత్తిడులు ఎదురైతున్నప్పటికీ భారత్- రష్యా మధ్య ఇంధన సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడుల కారణంగా కొంతకాలంగా భారత్ చమురు దిగుమతులను తగ్గించిందని తెలిపారు. కానీ పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కోసం నిరంతరాయంగా ఇంధన రవాణాను కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ప్రధాని మోడీ నివాసంలో ఆతిథ్యం సంతోషం కలిగించిందని అన్నారు పుతిన్. తమ సమావేశంలో అనేక అంశాలపై ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ప్రస్తుతం భారత్-రష్యా మధ్య 64 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరుగుతుందని.. 2030 నాటికి దానిని100 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యమని తెలిపారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత పెంచుకుంటామన్నారు.
►ALSO READ | భారత్, రష్యా 23 వ శిఖరాగ్ర సమావేశం.. కీలక ఒప్పందాలు ఇవే
ఉమ్మడి ప్రాజెక్ట్‌లు, టెక్నాలజీ అభివృద్ధిలోపరస్పరం సహకారం అందించుకుంటామని పేర్కొన్నారు. భారత్ ఇంధన అవసరాలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అణువిద్యుత్ కేంద్రం కుడంకుళం విషయంలో భారత్‌కు సహకారం అందిస్తున్నామని చెప్పారు. వైద్య, ఆరోగ్య రంగంలో కలిసి పనిచేస్తామని.. మేకిన్ ఇండియాకు మా మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. వచ్చేఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సమావేశం జరుగుతుందని తెలిపారు.
ఒకవైపు.. రష్యా నుంచి చమురు ఎవరూ చమురు కొనుగోలు చేయొద్దని.. ఒకవేళ రష్యాతో వాణిజ్యం చేస్తే భారీ సుంకాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరిస్తున్నప్పటికీ.. ఇండియా మాత్రం అమెరికా అధక్షుడి బెదిరింపులకు ఏ మాత్రం తలొగ్గకుండా ఏకంగా రష్యా అధ్యక్షుడిని ఇండియాకు ఆహ్వానించింది. అంతేకాకుండా రష్యా, ఇండియా మధ్య చమురు సరఫరా యధావిధిగా కొనసాగుతుందని ఇరుదేశాలు స్పష్టంగా చెప్పాయి. దీంతో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
