భారత్, రష్యా 23 వ శిఖరాగ్ర సమావేశం.. కీలక ఒప్పందాలు ఇవే

భారత్, రష్యా 23 వ శిఖరాగ్ర సమావేశం.. కీలక ఒప్పందాలు ఇవే

భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుక్రవారం(డిసెంబర్5)  ప్రధాని మోదీ  తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌ హౌస్‌ వేదికగా ఇరు దేశాధినేతలు 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో పలు అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చలు చర్చించారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు జరిగేలా వాణిజ్యం, రక్షణ రంగం, కెమికల్స్‌, ఫెర్టిలైజర్స్‌, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు వంటి పలు అంశాలపై చర్చించి ఒప్పందాలు చేసుకున్నారు. 

భారత్ లో ఇన్వెస్ట్ మెంట్ , టెక్నాలజీ రంగంలో సహకారం  అందించేందుకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ అన్నారు. రెండు దేశాల మధ్య లోకల్ కరెన్సీలో వాణిజ్యం జరుపుతామన్నారు. దేశంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ అయిన కుడంకులం ప్లాంట్ కు రష్యా సహకారం అందిస్తామని చెప్పారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టేందుకు రష్యా సిద్ధంగా ఉందన్నారు.  రెండు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక  సంబంధాలు బలోపేతం చేస్తామన్నారు. భారత్, రష్యా శిఖరాగ్ర సమావేశంలో ఫలవంతమైన చర్చలు జరిగాయన్న పుతిన్ .. భారత్ కు ఆహ్వానించిన ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పారు. 

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. విశ్వాసం, నమ్మకం ఆధారంగా  రెండు దేశాల మధ్య బంధం కొనసాగుతోందన్నారు. మేకిన్ ఇండియా సాకారంలో రష్యా సహకారం ఎంతో కీలకం అన్నారు. యూరియా ఉత్పత్తిలో రష్యాతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు  మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. స్వేఛ్చా వాణిజ్య ఒప్పందంపై  చర్చలు కొనసాగుతాయన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భారత్  శాంతి పక్షానే ఉంటుందన్న మోదీ.. ఉగ్రవాదం పై పోరాటంలో రష్యా సహకారం మరువలేనిదన్నారు.