ఇరాన్ లో కొనసాగుతున్న యుద్ధం సెగలు భారత పార్లమెంటును తాకాయి. బడ్జెట్ సమావేశాల రెండో దశ మెుదలైన తొలిరోజే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారత ఇంధన భద్రతపై గళమెత్తారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా.. భారతదేశ ఆర్థిక స్థిరత్వంపై, కోట్లాది మంది సామాన్యుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఖర్గే. అందువల్ల రాజ్యసభలో భారత ఇంధన భద్రతకు ఎదురవుతున్న సవాళ్ల గురించి మోడీ ప్రభుత్వం స్వల్పకాలిక చర్చ జరపాలని నోటీసు ఇచ్చారు.
ఖర్గే తన ప్రసంగంలో ప్రధానంగా మూడు కీలక అంశాలను హైలైట్ చేశారు. మొదటిది గృహ వినియోగదారులపై పడుతున్న ఆర్థిక భారం. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడంతో దేశీయంగా వంట గ్యాస్ ధర ఏకంగా 7 రూపాయలు పెరిగిందని ఆయన గుర్తుచేశారు. ఇది సామాన్య ప్రజల బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేస్తోందని విమర్శించారు. రెండవది గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న కోటి మంది భారతీయుల భద్రత. యుద్ధ వాతావరణం వల్ల అక్కడ ఉపాధి పొందుతున్న భారతీయుల జీవనోపాధి ప్రమాదంలో పడిందని, ఇప్పటికే కొందరు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం, గల్లంతవ్వడం విచారకరం అన్నారు ఖర్గే.
ఇక చివరిగా మూడోది కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్ట, ఆర్థిక పునాదులు దెబ్బతినే అవకాశం ఉందని ఖర్గే హెచ్చరించారు. ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఈ సంక్షోభం పెను సవాలుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ 'పశ్చిమ ఆసియా పరిస్థితి'పై రాజ్యసభలో ప్రకటన చేయనున్న నేపథ్యంలో.. అంతకంటే ముందే ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాలని ఖర్గే డిమాండ్ చేశారు. యుద్ధం వల్ల రానున్న ఆర్థిక మాంద్యం ముప్పును ఎదుర్కోవడానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందో లేదో దేశ ప్రజలకు తెలియాలని కాంగ్రెస్ సీనియన్ నేత ఖర్గే కోరారు.
