నాంపల్లి కోర్ట్‌లో ఇవాళ శుక్రవారం (జనవరి 23, 2026న) టాలీవుడ్ ప్రముఖ హీరోలు దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి రానా, నిర్మాత సురేష్ బాబు, మరియు అభిరామ్ హాజరుకావాల్సి ఉంది. గతంలో వ్యక్తిగతంగా హాజరుకావాలని అల్టిమేటం జారీ చేసిన కోర్టు, ఇవాళ తీర్పు కోసం విచారణ ఉత్కంఠ సృష్టిస్తోంది.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి: 2022 నవంబర్ 13న దక్కన్ కిచెన్ హోటల్ ను, జీహెచ్ఎంసీ సిబ్బంది మరియు దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు కొంతమంది బౌన్సర్ల సహాయంతో అక్రమంగా కూల్చివేసి, హోటల్‌లోని విలువైన సామగ్రిని దోచారని హోటల్ యజమాని నందకుమార్ 2024 జనవరిలో నాంపల్లి కోర్ట్‌కు అందించిన పిటిషన్‌లో వెల్లడించారు.
కోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు చేయగా, 2024 మార్చిలో మరోసారి హోటల్ కూల్చివేసి, కోట్ల విలువైన సామగ్రి దోచడంపై నందకుమార్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంతో నందకుమార్ మళ్లీ నాంపల్లి కోర్ట్‌ను ఆశ్రయించారు.
కోర్టు ఆదేశాల మేరకు, 2025 జనవరిలో FIR No:25/2025గా కేసు నమోదు చేయబడింది. అయితే, గత పది నెలలుగా ఎటువంటి విచారణ జరగలేదు. ఈ క్రమంలోనే, నాంపల్లి కోర్టు ఆదేశాలను పాటిస్తూ, దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు స్వయంగా వ్యక్తిగత బాండ్లు సమర్పిస్తూ హాజరుకావాల్సి ఉంది. గతంలో వారు లాయర్ల ద్వారా బాండ్లను సమర్పించినప్పటికీ, కోర్టు తిరస్కరించి, వ్యక్తిగత హాజరుకు ఆదేశించింది.
అయితే, ఇవాళ శుక్రవారం దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు హాజరు కాకపోతే, నాన్ బైలబుల్ వారెంట్ (N.B.W.) జారీ చేయబడే అవకాశం ఉంది. అందువల్ల ఇపుడు ఈ కేసు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. హోటల్ యజమాని నందకుమార్, తమకు జరిగిన నష్టం పరిష్కారం అయ్యేవరకు న్యాయపోరాటం ఆగదని తెలిపారు.
ఈసారైనా, దగ్గుబాటి ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను గౌరవించి హాజరు అవుతారా, లేక మరోసారి నిర్లక్ష్యం చేస్తారా? అనే ఆసక్తికర ప్రశ్న నెలకొంది. ఈ క్రమంలో నాంపల్లి కోర్ట్ తీర్పు కోసం మీడియా, అభిమానులు, మరియు టాలీవుడ్‌లో భారీ ఉత్కంఠ నెలకొంది. ఏం జరుగుతుందో చూడాలి!!
