
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తో దేశంలోని ఏ ఒక్క పౌరుడికి గానీ, మతానికి గానీ ఇబ్బంది లేదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. మైనారిటీలకు ఎలాంటి సమస్య రాదని చెప్పారు. ఒక్క ఇండియన్పైనా ప్రభావం చూపదని, మైనారిటీ హక్కులకు ఎలాంటి ముప్పు రాదని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజల చేతిలో తిరస్కరణకు గురైన వారే.. తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం యాంటీ సీఏఏ నిరసనలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. గాంధీ, నెహ్రూ కలలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంటే.. కాంగ్రెస్‌కు సమస్యలు వస్తున్నాయని ఎగతాళి చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు గొడవ చేయకపోయుంటే.. వాటి నిజ స్వరూపం ప్రజలకు తెలిసేది కాదన్నారు. గురువారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మోడీ మాట్లాడారు. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని రామజన్మభూమి, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ వంటి సమస్యలు ఎన్డీయే ప్రభుత్వం చొరవతో కొలిక్కి వచ్చాయని చెప్పారు. తమ ప్రభుత్వ పనితీరును మెచ్చిన ప్రజలు మరోసారి అధికారం కట్టబెట్టారని అన్నారు. దాదాపు 100 నిమిషాల పాటు మోడీ మాట్లాడారు.రాష్ట్రపతి ప్రసంగ తీర్మానానికి లోక్‌సభ, రాజ్యసభ వాయిస్ ఓటుతో ఆమోదం తెలిపాయి.
రాటుదేలాను..
ఆరునెలల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే ప్రధాని మోడీని యువత కర్రలతో బాదుతారని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్‌పై మోడీ స్పందించారు. కర్రల దాడిని తట్టుకునేలా తాను ప్రతిరోజూ చేసే సూర్య నమస్కారాల సంఖ్యను పెంచాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. 20 ఏళ్లుగా తాను ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని, ఇప్పుడు రాటుదేలానని చెప్పారు. తర్వాత రాజ్యసభలో జరిగిన చర్చలో మోడీ సమాధానం చెప్పారు. ఎలాంటి నిర్మాణాత్మక సూచనలు చేయలేదని ప్రతిపక్షాలను విమర్శించారు.
నెహ్రూ వివక్ష చూపారా?
సీఏఏను సమర్థించుకుంటూ గాంధీ, నెహ్రూ చెప్పిన విషయాలను కూడా ప్రధాని ప్రస్తావించారు.ఈ పాకిస్తాన్‌లోని మైనారిటీలకు మన సిటిజన్‌షిప్ ఇవ్వాలని నెహ్రూ కోరుకున్నారని మోడీ చెప్పారు. ‘‘1950లో అస్సాం తొలి ముఖ్యమంత్రి గోపినాథ్ బోర్డోలోయ్‌కి ప్రధాని నెహ్రూ ఓ లెటర్ రాశారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న హిందూ రెఫ్యూజీలు, ముస్లిం మైగ్రెంట్లకు మధ్య తేడాను గుర్తించాలని కోరారు. రెఫ్యూజీలకు సిటిజన్‌షిప్ ఇచ్చేందుకు చట్టాన్ని సవరించాలని చెప్పారు. మహాత్మా గాంధీ మాత్రమే కాదు.. నెహ్రూ కూడా అదే సెంటిమెంట్‌తో ఉన్నారు. మరి నెహ్రూ కమ్యూనల్నా? హిందువులు, ముస్లింల మధ్య ఆయన వివక్ష చూపారా? ఆయన హిందూ దేశం కావాలని భావించారా?” అని ప్రశ్నించారు.
‘సేవ్ కాన్స్టిట్యూషన్’ మీకు ఓ మంత్రం కావాలి..
రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ఉల్లంఘించిందన్న కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన మోడీ.. ‘‘రాజ్యాంగాన్ని కాపాడటం గురించి తరచుగా మాట్లాడటమే ఆ పార్టీ మంత్రం కావాలి. అలా అయితేనే రాజ్యాంగం పవిత్రతను గుర్తుంచుకుంటుంది. నాడు కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించింది. జ్యుడీషియరీ అధికారాలను పరిమితం చేసింది. ప్రజల ‘రైట్ టు లైఫ్’కు వ్యతిరేకంగా మాట్లాడింది. రాష్ర్టాల్లో ఇతర పార్టీల ప్రభుత్వాలను రద్దు చేసింది” అని మండిపడ్డారు. కాంగ్రెస్ ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటుందని భావించామని, కానీ తప్పుడు తోవలో వెళ్తోందని అన్నారు.
అరాచకానికి దారి తీస్తయ్..
‘‘సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను ప్రతిపక్షాలను ప్రోత్సహిస్తున్నాయి. పార్లమెంటు, రాష్ర్ట అసెంబ్లీలు చేసిన చట్టాలకు వ్యతిరేకంగా చేసే ఆందోళనలు అరాచకానికి దారి తీస్తాయి’’ అని మోడీ అన్నారు. ‘‘సీఏఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు రోడ్లమీదికి వచ్చి ఆందోళనలు చేస్తున్నాయి. సీఏఏను వ్యతిరేకిస్తూ రాజస్థాన్ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తే ఏమవుతుంది. ప్రజలు ధర్నాలు చేసి.. చివరికి కాల్పుల దాకా వెళ్తే పరిస్థితి ఏంటి? ఇదే విషయం మధ్యప్రదేశ్‌కు కూడా వర్తిస్తుంది. దేశం ఇలాంటి బాటలో నడవాలా? ఇది అరాచకానికి మార్గం. అలాంటి దారి మిమ్మల్ని (ప్రతిపక్షాలను) కూడా ఇబ్బందుల్లో పడేస్తుంది” అని ప్రధాని అన్నారు.
ముస్లింలు కాదు ఇండియన్లు
కాంగ్రెస్ వాళ్లు ముస్లింలను ముస్లింలుగానే చూస్తారని.. కానీ తమ పార్టీ ముస్లింలను ఇండియన్లుగా
చూస్తుందని మోడీ చెప్పారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పాదాలను తాకానని చెప్పారు. బేగం హజ్రత్ మహల్, అబ్దుల్ కలాం… లాంటి వాళ్లందరూ ఇండియన్సేనని చెప్పారు.
ఇదేనా సెక్యులరిజం
1984 యాంటీ సిక్కు అలర్లలో హస్తం ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసిందని మోడీ మండిపడ్డారు. ‘‘సెక్యులరిజం గురించి మాట్లాడుతున్న ఆ పార్టీ.. 1984 సిక్కులపై జరిగిన హింసను మరిచిపోయిందా? ఇది సిగ్గు చేటు. దోషులను శిక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు” అని ఆరోపించారు. ‘‘వ్యవసాయ బడ్జెట్ గతంలో రూ.27 వేల కోట్లు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 1.5 లక్షల కోట్లకు చేరింది. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో 5 రెట్లు పెరిగింది” అని ప్రధాని చెప్పారు. రాజకీయ వ్యతిరేకతతో కొన్ని రాష్ర్టాలు పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. రైతుల వి షయంలో రాజకీయాలు చేయొద్దని ఆయన కోరారు.